న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ప్రభుత్వ రంగ ఉక్కు ఉత్పాదక దిగ్గజం సెయిల్‌కు చెందిన భద్రావతి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేకులు పడ్డాయి. కొనేవారు కరువవడంతో అమ్మాలనే ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకున్నది. కర్నాటకలోని భద్రావతిలోగల విశ్వేశ్వరాయ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్‌లో సెయిల్కున్న 100 శాతం వాటాను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా అమ్ముతున్నామని, ఆసక్తిగలవారు ముందుకు రావచ్చని 2019 జూలైలో మోదీ సర్కారు ఆహ్వానించింది.
అయితే మూడేండ్లు గడిచినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఎట్టకేలకు బుధవారం తమ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఈ మేరకు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) తెలియజేసింది. తాము కొంటామని సుముఖతను వ్యక్తం చేస్తూ కొన్ని బిడ్లు వచ్చినా.. స్పందన సంతృప్తికరంగా లేదని వివరించింది. ఈ క్రమంలోనే ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు స్పష్టం చేసింది.
బీపీసీఎల్ విక్రయంలోనూ దెబ్బ
ఇప్పటికే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వాటాల విక్రయంలోనూ మోదీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. బీపీసీఎల్‌లో 53 శాతం ప్రభుత్వ వాటాను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ప్రతికూల పరిస్థితుల మధ్య ఎవరూ కొనేందుకు ఆసక్తి చూపలేదు. ఇంధన ధరల్లో ఒడిదుడుకులు.. బిడ్డర్లను దూరం చేసింది. అలాగే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్)లో పూర్తిగా 100 శాతం వాటాను అమ్మేయాలనీ చూశారు. ఇదీ విఫల ప్రయత్నంగానే నిలిచింది.