హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ వర్సిటీ: భవిష్యత్తులో వ్యవసాయ రంగంవైపు యువతను ఆకర్షించడానికి కృత్రిమ మేధస్సుతో కూడిన డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చాలా తోడ్పాటు అందిస్తున్నదని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎస్బీఐ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన తొలిదశ అగ్రి రోబోటిక్స్ ప్రయోగశాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. దేశీయ వ్యవసాయ వర్సిటీల్లో తొలిసారిగా అధునాతన అగ్రి రోబోటిక్స్ ప్రయోగశాలను ఇక్కడే తెచ్చారు.
ఈ సందర్భంగా శెట్టి మాట్లాడుతూ.. వర్సిటీ పూర్వ విద్యార్థిగా ఈ ల్యాబ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. దీనికి కృషి చేసిన వర్సిటీ అధికారులు, సిబ్బంది, ఎస్బీఐ ఫౌండేషన్ ప్రతినిధులను శెట్టి అభినందించారు. ఇదిలా ఉంటే ఎస్బీఐ లావాదేవీలను డిజిటలీకరణ చేయడంలో తాను చురుకైన పాత్ర పోషించానని గుర్తుచేశారు. ప్రతిరోజూ ఎస్బీఐ వినియోగదారులు సుమారు రూ.23 కోట్ల యూపీఐ లావాదేవీలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా వీసీ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. 2030-35 నాటికి తెలంగాణలోని రైతుల పొలాల్లో రోబోలు, డ్రోన్లు, మానవ రహిత ట్రాక్టర్లు, సెన్సార్ల వినియోగం విసృ్తతం కానున్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ఈ దిశగా పరిశోధనలు చురుకుగా సాగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్రిహబ్ ఎండీ డాక్టర్ జీ వెంకటేశ్వర్లు, ఏఆర్ఐఎస్ఏ ల్యాబ్ ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, పీజేటీఏయూ, ఎస్బీఐ అధికారులు, వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.