SEBI | మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇతర మార్కెట్ నియంత్రణ సంస్థలతో కలిసి కేవైసీ వ్యవస్థ సెంట్రలైజ్ దిశగా కృషి చేస్తుందని సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే తెలిపారు. కేంద్రీకృత కేవైసీ వ్యవస్థను రూపొందించడానికి పనిచేస్తున్న కమిటీకి ఆర్థిక కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సెబీ చైర్మన్ వెల్లడించారు. అయితే, దీనికి ఎలాంటి కాలపరిమితిని నిర్ణయించనప్పటికీ.. త్వరలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ ప్రత్యేకతను వివరిస్తూ.. ఈ వ్యవస్థ చాలా ప్రభావవంతంగా ఉంటుందని, ఇక్కడ కేవైసీ ఒకే చోట జరుగుతుందన్నారు. కేవైసీ అన్ని ప్రదేశాల్లో ఆటోమేటిక్‌గా జరుగుతుందని చెప్పారు.
కేవైసీ అప్లోడ్ చేయబడటమే కాకుండా.. దాని చెల్లుబాటును పూర్తిగా తనిఖీ చేయనున్నట్లు తుహిన్ కాంత్ పాండే వివరించారు. 2025లో కొత్త, సవరించిన సెంట్రల్ నో యువర్ కస్టమర్ (KYC) రిజిస్ట్రీని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఏప్రిల్‌లో ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ పునర్నిర్మాణం, ఆర్థిక సేవలను సులభంగా యాక్సెస్ చేయడానికి కేవైసీ సమ్మతికి సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించారు. అనధికార సలహా సేవలను గుర్తించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పాండే తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహకారం ద్వారా సెబీ 70వేల కంటే ఎక్కువ మోసపూరిత పెట్టుబడి హ్యాండిల్స్, తప్పుదారి పట్టించే పోస్ట్‌లను విజయవంతంగా తొలగించిందని పేర్కొన్నారు.