ముంబై, సెప్టెంబర్ 13: రిటైల్ రుణాలతో జాగ్రత్త అని బ్యాంకులను హెచ్చరించారు బ్యాంకింగ్ వెటరన్ కేవీ కామత్. రిటైల్ రుణాలు అన్ని పరిశీలించాకే మంజూరు చేయాలని, లేకపోతే భవిష్యత్తులో నిరర్థక ఆస్తులుగా మారే అవకాశాలుంటాయని బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చెప్పారు.
బ్యాంకుల వ్యాపారంలో ఎక్కువ భాగం రిటైల్ విభాగం నుంచి వస్తుండటంతో కాలక్రమేణా బ్యాంకులు నిధులపై ఆధారపడటం తగ్గుతుందని, రిటైల్ రంగంలో ఆస్తి నాణ్యత చాలా త్వరగా క్షీణిస్తుంది. దీంతో ఎటువంటి సమస్య ఉండదని చెప్పలేను అని చెప్పారు. ఇటీవల బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఫిన్టెక్ సంస్థలు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి కూడా రుణాలు మంజూరు చేస్తున్నాయని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం డెరివేటివ్ సెగ్మెంట్లో పెట్టుబడులు పెట్టిన చిన్నస్థాయి ఇన్వెస్టర్లు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు నష్టపోయారన్నారు.