ముంబై, జనవరి 18: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సేవల సంస్థ కొటక్ మహీం ద్రా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,701 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,265 కోట్ల లాభంతో పోలిస్తే 10.22 శాతం వృద్ధిని కనబరిచింది.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.14,096 కోట్ల నుంచి రూ.16,050 కోట్లకు చేరుకున్నట్లు, అలాగే నిర్వహణ ఖర్చులు కూడా రూ.9,530 కోట్ల నుంచి రూ.10,869 కోట్లకు ఎగబాకాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ స్వల్పంగా పెరిగి 1.49 శాతం నుంచి 1.50 శాతానికి చేరుకున్నాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.794 కోట్ల నిధులను వెచ్చించింది. క్రితం ఏడాది కేటాయించిన రూ.660 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి.