న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఏటీఎం లావాదేవీలకు చార్జీలను పెంచేసింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా లావాదేవీలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజును రూ.21 నుంచి రూ.23కి పెంచుతున్నట్టు ప్రకటించింది. సొంత ఏటీఎంతోపాటు ఇతర ఏటీఎంలలో ఉచిత లావాదేవీల తర్వాత జరిపే లావాదేవీలకు ఈ ఫీజు వర్తించనున్నదని పేర్కొంది.
రిజర్వు బ్యాంక్ ఇటీవల ఏటీఎం చార్జీలు పెంపుపై విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొటక్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని బ్యాంక్ ఖాతాదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది. మరోవైపు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్పై ప్రస్తుతం విధిస్తున్న చార్జీని రూ.8.50 నుంచి రూ.10కి సవరించింది. బ్యాంక్ ఏటీఎంలో ఐదు లావాదేవీలు ఉచితంగా అందిస్తున్నది. ఆ తర్వాత జరిపే ప్రతీ లావాదేవీలకు ఈ చార్జి వర్తించనున్నదని పేర్కొంది.