Kinetic Green E-Luna | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కెనెటిక్ గ్రీన్.. దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ అవతార్ ఈ-లూనా ప్రవేశ పెట్టింది. ఈ ఈ-లూనా పట్ల ఆసక్తి గల కస్టమర్లు ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. గత నెల 26 నుంచే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. దీని ధర రూ.69,990 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు. కస్టమర్లు రూ.500 టోకెన్ సొమ్ము చెల్లించి ఈ-లూనా బుక్ చేసుకోవచ్చు. పేదలతోపాటు నెలకూ రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం పొందే సర్వీస్ రంగ ఉద్యోగులకు ఈ ఈ-లూనా వెసులుబాటుగా ఉంటుందన్నారు. వంద కి.మీ దూరం ప్రయాణించడానికి రూ.10 ఖర్చు వస్తుంది.
కెనెటిక్ ఈ-లూనా ఐదు రంగులు-మల్బరీ రెడ్, ఓసియన్ బ్లూ, పెరల్ ఎల్లో, స్పార్క్ లింక్ గ్రీన్, నైట్ స్టార్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. రెండు వాట్ల విద్యుత్ మోటారుతో వస్తున్న ఈ కెనెటిక్ ఈ-లూనా స్వాపబుల్ 2 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో అందుబాటులో ఉంటుంది. సింగిల్ చార్జింగ్ తో 110 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. గంటకు గరిష్టంగా 50 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ ఈ-లూనాపై ఐదేండ్ల వారంటీ అందిస్తున్నది కెనెటిక్ గ్రీన్. ఈ-లూనాతోపాటు పోర్టబుల్ చార్జర్ ఉంటుంది. నాలుగు గంటల్లో పూర్తి స్థాయిలో చార్జింగ్ అవుతుంది. చార్జింగ్ కోసం యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. రెండు వైపులా కాంబి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.