న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్లో కియా ఇండియా 14,441 కార్లను విక్రయించి దూకుడు కొనసాగిస్తోంది. భారత్లో 7.8 శాతం మార్కెట్ వాటాతో కియా దేశంలో అత్యధిక కార్లు అమ్ముడవుతున్న నాలుగవ కార్ల తయారీ కంపెనీగా అవతరించింది. గత ఏడాది మార్కెట్ వాటా 1.4 శాతం నుంచి కియా ఇండియా తాజాగా 7.8 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ఇక సెప్టెంబర్లో కియా సెల్టోస్ అత్యధికంగా 9583 యూనిట్ల విక్రయంతో నెలలో అత్యధికంగా అమకాలు సాగించిన ఎస్యూవీగా నిలిచింది.
కియా సోనెట్, కియా కార్నివాల్లు వరుసగా 4,454, 404 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక కియా ఇండియా ఇప్పటికే 3.3 లక్షల వాహనాలను విక్రయించగా, సెప్టెంబర్లో సోనెట్ లక్ష యూనిట్ల విక్రయ మైలురాయిని అధిగమించింది. సప్లయి చైన్ ఇబ్బందులతో గత నెలలో పరిశ్రమ సెంటిమెంట్ దెబ్బతిందని, పండగ సీజన్ ముందున్న నేపధ్యంలో సెమికండక్టర్ సేకరణ పరిస్ధితులు మెరుగవుతాయని తాము ఆశిస్తున్నామని కియా ఇండియా సేల్స్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ ఆశాభావం వ్యక్తం చేశారు.తాజాగా సెల్టోస్ ఎస్యూవీకి ఎక్స్ లైన్ ఎడిషన్ను జోడించడం ద్వారా అమ్మకాలను అనూహ్యంగా పెంచుకునేందుకు కియా ఇండియా సిద్ధమైంది.