Kia Seltos Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా.. ఇటీవలే ఆవిష్కరించిన ఎస్యూవీ సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కోసం కస్టమర్ల నుంచి గిరాకీ పెరుగుతోంది. సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరించిన 63 రోజుల్లో 50 వేలకు పైగా కార్ల కోసం ప్రీ-ఆర్డర్లు నమోదయ్యాయని కియా తెలిపింది. అందునా నాన్ మెట్రోపాలిటన్ నగరాల వాసుల నుంచి అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తున్నది. వినియోగదారుల గిరాకీని పరిగణనలోకి తీసుకున్న కియా ఇండియా.. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కార్ల తయారీ సామర్థ్యం 4000 నుంచి 5000 యూనిట్లకు పెంచనున్నది.
ఓనం పండుగతోపాటు గణేశ్ చతుర్థి వేడుకలతో దేశవ్యాప్తంగా ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా సకాలంలో న్యూ సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కార్లను డెలివరీ చేయడానికి ప్రణాళిక రూపొందించాం అని కియా హిండియా నేషనల్ సేల్స్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుండాయ్ క్రెటా, ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన హోండా ఎలివేట్ వంటి ఎస్యూవీ కార్లతో పోటీ పడేందుకు కియా ఇండియా.. తన సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో మరో రెండు ట్రిమ్స్ వేరియంట్లు జత చేసింది. కస్టమర్లకు తక్కువ ధరలో అందించేందుకు టాప్ వేరియంట్లకు దిగువన 360-డిగ్రీ కెమెరా, బోస్ సరౌండ్ సౌండ్ వ్యవస్థలను తొలగించిన రెండు ట్రిమ్స్ జత చేశాం అని హర్దీప్ సింగ్ బ్రార్ చెప్పారు. అయితే, కొత్త వేరియంట్లలో పార్క్ అసిస్ట్ కోసం రేర్ కెమెరా ఫీచర్ జత చేశారు. కస్టమర్లకు చేరువయ్యేందుకు కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్‌లో జత చేసిన రెండు ట్రిమ్స్‌తో మొత్తం 20 ట్రిమ్స్కు చేరుకున్నాయి. ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో తాము బలంగానే ఉన్నాం. మా సేల్స్‌లో 60 శాతం నాన్ మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. 45-50 శాతానికంటే ఎక్కువ పోటీ నెలకొని ఉంది.
ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీకి భారీ డిమాండ్ ఉంది. 50 వేలకు పైగా ప్రీ-ఆర్డర్లలో 63 శాతం ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, 77 శాతం కనెక్టెడ్ ఎస్యూవీలని బ్రార్ వెల్లడించారు. భారత్ కార్ల మార్కెట్లో కియా వాటా ఏడు శాతం. 2030 నాటికి పది శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2025 నాటికి మూడు కొత్త మోడల్ కార్లు, ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ)తో కూడిన బుల్లి ఎస్యూవీ, రెండు ఎలక్ట్రిక్ కార్లు ఆవిష్కరించనున్నది కియా ఇండియా.