Kia Carnival | ప్రముఖ దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా (Kia India) వచ్చేనెల మూడో తేదీన తన లగ్జరీ మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) కారు కార్నివాల్ -2024 (Carnival 2024) ఆవిష్కరించనున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి కియా కార్నివాల్ – 2024 ప్రీ లాంచ్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ఈ కారు బుకింగ్ కోసం కనీసం రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కియా ఇండియా వెబ్సైట్, కియా డీలర్ షిప్‌ల వద్ద బుక్ చేసుకోవచ్చు. ఈ కారు కంప్లీట్లీ బిల్ట్ అప్ (సీబీయూ) మోడల్ గా మార్కెట్ లోకి రానున్నది.
న్యూ కియా కార్నివాల్ కారు సెకండ్ రో లగ్జరీ పవర్డ్ రిలాక్సేషన్ సీట్స్ విత్ వెంటిలేషన్ అండ్ లెగ్ సపోర్ట్, వన్ టచ్ స్మార్ట్ పవర్ స్లైడింగ్ డోర్, డ్యుయల్ సన్ రూఫ్, 12-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డ్యుయల్ పనోరమిక్ కర్వ్డ్ డిస్ ప్లే, 12.3 అంగుళాల సీసీఎన్‌సీ ఇన్ఫోటైన్ మెంట్, 12.3 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 23 అటానమస్ ఫీచర్లతోపాటు లెవల్ -2 అడాస్ సిస్టమ్ ఉంటుంది. కియా కార్నివాల్ కారు 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ తో వస్తుందని భావిస్తున్నారు. పాత కియా కార్నివాల్ కారు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తోపాటు 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ (200 పీఎస్ విద్యుత్, 440 ఎన్ఎం టార్క్) తో వస్తున్నది.
కియా కార్నివాల్ -2024 కారు ధర సుమారు రూ.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుందని భావిస్తున్నారు. టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రీడ్ వర్షన్ ధర రూ.25.97 లక్షల నుంచి రూ.30.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య, టయోటా వెలిఫైర్ కారు రూ.1.22 కోట్ల నుంచి రూ.1.32 కోట్ల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. ఇప్పటి వరకూ కియా కార్నివాల్ కారు 14,500 యూనిట్లు అమ్ముడైంది. కియా కార్నివాల్ -2024 ఎంపీవీతోపాటు ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును అక్టోబర్ మూడో తేదీన కియా ఆవిష్కరించనున్నది.