న్యూఢిల్లీ, జనవరి 31 : కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. డిసెంబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే భారీగా తగ్గగా, అలాగే వరుస నెల నవంబర్ నెలతో పోలిస్తే 4.4 శాతాని కంటే తగ్గింది. సహజ వాయువు ఉత్పత్తి ప్రతికూలానికి పడిపోవడంతోపాటు బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్ ఉత్పత్తి భారీగా పడిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. బొగ్గు ప్రొడెక్షన్ 10.8 శాతం నుంచి 5.3 శాతానికి పడిపోగా, రిఫైనరీ ఉత్పత్తులు సగానికి సగం 2.8 శాతానికి దిగిరాగా, ఎరువులు వృద్ధి 1.7 శాతం నమోదైనట్లు తెలిపింది. కానీ, సిమెంట్ 4 శాతం వృద్ధి నమోదుకాగా, విద్యుత్ 5.1 శాతం వృద్ధి కనబరిచాయి. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలానికిగాను కీలక రంగాలు 4.2 శాతానికి పరిమితమయ్యాయి.