జైసల్మేర్, డిసెంబర్ 21: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఎలక్ట్రిక్ వాహనాల వినిమయాన్ని పెంచడానికి ఈ వాహనాలపై 5 శాతం జీఎస్టీని విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. అలాగే బిజినెస్ అవసరాలకోసం వినియోగించే యూస్డ్ కార్లపై పన్నును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచిన కౌన్సిల్..విమాన ఇంధనం(జెట్ ఫ్యూయల్)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. వన్-నేషన్-వన్-ట్యాక్స్ అనే నినాదంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించడంతో జెట్ ఫ్యూయల్‌పై జీఎస్టీ విధింపు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నది.
బీమా ప్రీమియం వసూళ్లపై జీఎస్టీని తగ్గిస్తారని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. ప్రస్తుత సమావేశంలో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. పన్ను తగ్గింపుపై ప్యానెల్ తుది నివేదిక సమర్పించకపోవడం వల్లనే వాయిదావేసింది. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంపై జీఎస్టీని మినహాయింపు నివ్వాలని సూచించిన మంత్రుల బృందం.. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా కవరేజ్‌పై కూడా పన్ను ఎత్తివేయాలని సూచించింది.