Baba Ramdev | యోగా గురువు రాందేవ్ బాబాకు కేరళ కోర్టు షాక్ ఇచ్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించే వైద్య వాణిజ్య ప్రకటనలు జారీ చేశారన్న ఆరోపణలపై రాందేవ్ బాబా సారధ్యంలోని పతంజలి ఆయుర్వేదిక్ అనుబంధ దివ్య ఫార్మసీపై కేరళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు హాజరు కానందుకు రాందేవ్ బాబా, పతంజలి సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణలకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేస్తూ పాలక్కడ్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్2 కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15న కేసు విచారణకు హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఇంతకు ముందు శనివారం (ఫిబ్రవరి ఒకటో తేదీ) విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ గైర్హాజరయ్యారు. దీంతో మేజిస్ట్రేట్ కోర్టు వారికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్లు జారీ చేసింది.
1954, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అభ్యంతరకర వాణిజ్య ప్రకటనలు) చట్టంలోని 3, 3 (బీ), 3 (డీ) సెక్షన్ల ప్రకారం దివ్య ఫార్మసీ, ఆచార్య బాలకృష్ణ, రాందేవ్ బాబాలపై కేరళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కేసులు నమోదు చేశారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులపై జారీ చేసిన వాణిజ్య ప్రకటనలు అల్లోపతి వంటి ఆధునిక వైద్య వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమ తీర్పును ఉల్లంఘిస్తూ వాణిజ్య ప్రకటనలు కొనసాగించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం.. పతంజలి ఆయుర్వేద్‌కు కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై రాందేవ్, బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద్ బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాత కంటెంప్ట్ కేసులను మూసేసింది.