Adani-Kenya | అదానీ గ్రూపుపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో యూఎస్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపిన నేపథ్యంలో కెన్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అదానీ గ్రూపుకు కేటాయించిన కాంట్రాక్టులు రద్దు చేసుకున్నది. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం కోసం భారత్ లోని వివిధ రాష్ట్రాల అధికారులకు ముడుపులిచ్చారన్న ఆరోపణలపై యూఎస్ న్యూయార్క్ కోర్టులో కేసు దాఖలైన సంగతి తెలిసిందే. అదానీ గ్రూపుతో చేసుకున్న జోమో కెన్యట్టా అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధితోపాటు విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టు రద్దు చేస్తున్నామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) కింద విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి 736 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం అదానీ గ్రూప్, కెన్యా ప్రభుత్వం చేసుకున్నాయి. ఈ ఒప్పందం 30 ఏండ్ల పాటు అమల్లో ఉంటుంది. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో సదరు ఒప్పందానికి కెన్యా సర్కార్ గుడ్ బై చెప్పేసింది. ఇక జొమో కెన్యట్టా అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కోసం అదానీ గ్రూపునకు కాంట్రాక్టు అప్పగించొద్దంటూ స్థానికులు నిరసనలు తెలిపారు. దీంతో తాత్కాలికంగా ప్రాజెక్టు నిలిపేసిన కెన్యా సర్కార్.. తాజాగా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు నిర్ణయించింది. మిత్ర దేశాల దర్యాప్తు సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు నిర్ణయం తీసుకున్నామని విలియం రూటో తెలిపారు.