చెన్నై, జూలై 2: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్.. క్షేమా జనరల్ ఇన్సూరెన్స్‌తో ఓ వ్యూహాత్మక బ్యాంకస్యూరెన్స్ అలయెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంత కస్టమర్లకు బహుళ ప్రయోజన బీమా ప్రొడక్ట్ ‘క్షేమా కిసాన్ సాథి’ని అందిస్తారు. కాగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరూర్ వైశ్యా బ్యాంక్కున్న బలమైన నెట్‌వర్క్‌కు.. ఆధునిక సాంకేతికతతో బీమా పరిష్కారాలను అందించే క్షేమా తోడవడంతో అటు ఇన్సూరెన్స్ విక్రయాలు, ఇటు పాలసీదారులకు ప్రయోజనాలు పెరుగుతాయన్న విశ్వాసాన్ని ఇరు సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.
‘గ్రామీణ ప్రాంతాల్లో బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన మేము.. మా కస్టమర్లు రోజూ ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోగలం. అందుకే క్షేమా కిసాన్ సాథితో కేవలం బీమా సదుపాయాన్నే కాదు.. పాలసీదారులకు ప్రశాంతతను కూడా అందిస్తున్నాం’ అని కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ, సీఈవో రమేశ్ బాబు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ‘కరూర్ వైశ్యా బ్యాంక్ ఖాతాదారులకు పంట బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా రెండూ అందుతాయి. క్షేమా కిసాన్ సాథి బీమాను లక్షలాది గ్రామీణ కుటుంబాలను, వ్యవసాయ ఆంత్రప్రెన్యూర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించాం’ అని క్షేమా జనరల్ ఇన్సూరెన్స్ చైర్మన్ నట్రాజ్ అన్నారు.