హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వస్త్రమంటేనే రంగుల కళ.. కొంటే పట్టువస్ర్తాలే కొనాలి.. ముట్టుకున్నా.. పట్టుకున్నా కాంచీపురం వస్ర్తాలనే ధరించాలని చెబుతుంటారు. హైదరాబాద్ మహానగరంలో వస్త్ర నిలయాలకు కొదవలేదు. ఎన్ని ఉన్నా.. వేటికవే ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఇక అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్‌లోని కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ వస్ర్తాలకు భలే డిమాండ్ పెరుగుతున్నదని వస్త్ర నిలయం మేనేజర్ సునీల్ పేర్కొన్నారు. నగరంలో ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నా, నూతన డిజైన్లకు మారు పేరైన తమ వస్త్ర నిలయం ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తుందని తెలిపారు. సునీల్ చెప్పినట్టే వినియోగదారుల మనసుకు నచ్చేలా వివిధ రకాల కలర్ ఫుల్ సారీలు ఇక్కడ కొలువుదీరాయి.
చీరను ఎంచుకోవడమూ ఓ కళే…
సందర్భాన్ని బట్టీ చీరను ఎంచుకోవడమూ ఓ కళేనని, పెండ్లిలు, పండుగల్లో ఖరీదైన పట్టు చీరలు, దానికి తగిన నగలతో మహిళలు దర్శనమిచ్చే వారూ ఉంటారు. అదే గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు సిల్క్, కాటన్ వంటి సాదా చీరల్లో కనిపిస్తారు. ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వహించే వారైతే కాటన్ చీరలను ధరించి ఎంతో హుందాగా కనిపిస్తారు. ఇక వేసవిలో చీరలను ధరించాలంటే లైట్ కలర్స్, పండుగలు, ఉత్సవాల సమయంలో పదిమందిలో ప్రత్యేకంగా కనబడేందుకు ముదురు రంగు చీరలు ధరించేందుకు ఇష్టపడుతారని పేర్కొన్నారు.
మహిళలు హుందాగా కనిపించేలా…
భారతీయ సంప్రదాయంలో చీరలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. మహిళలు ఎంచుకునే సారీ కలర్స్ వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. చీరలు మహిళలను హుందాగా చూపిస్తాయనడానికి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వస్ర్తాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు సునీల్. ఇక చిన్న పెద్ద తేడా లేకుండానే ప్రత్యేక సమయాల్లో ధరించడానికి ఎన్నో రకాల వస్ర్తాలు అందుబాటులో ఉన్నట్టు వివరించారు. పండగలు, ఫంక్షన్లు, శుభకార్యాలు ఇట్లా అనేక సందర్భాల్లో పట్టు వస్ర్తాలు ఎంతో గౌరవాన్ని పెంచుతాయని, వాటికే చాలా మంది మొగ్గుచూపుతారని చెప్పారు.
ఆకట్టుకునే పట్టు వస్ర్తాలెన్నో…
చిన్న నుంచి పెద్దల వరకు జీన్స్, ప్రాక్స్, రకరకాల డ్రెస్సులతోపాటు పలు రకాల చీరలు స్త్రీలను ఆకట్టుకుంటున్నాయి. పండుగలు, పెండ్లిలకు తళతళలాడే పట్టుచీరలు ఉండి తీరాల్సిందే. ప్రస్తుతం వర్క్ చీరల ఫ్యాషన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఆధునిక ప్రపంచంలో పట్టు చీరలపైనే మక్కువ చూపుతున్నారు. మగ్గాలపై నేసే పట్టు చీరలకే గిరాకీ ఎక్కువగా ఉన్నట్టు కొనుగోలుదారులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఎందుకంటే మగ్గంపై నేసిన చీరలు ఎంతో నాన్యతతో ఉంటాయని పేర్కొన్నారు. ఇక పెండ్లి పట్టుచీరలైతే మహిళలు పదిలంగా దాచి తమ పిల్లలతో తమ పెండ్లినాటి విశేషాలను పంచుకుంటారని చెబుతుంటారు.