న్యూఢిల్లీ, జనవరి 11: ప్రాంతీయ సర్చ్ ఇంజిన్ జస్ట్ డయల్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ. 131. 31 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.92.01 కోట్ల లాభంతో పోలిస్తే 42.7 శాతం ఎగబాకింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8.4 శాతం ఎగబాకి రూ.287.33 కోట్లకు చేరుకున్నది. నిర్వహణ ఖర్చులు రూ.215.57 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ అధికారి శ్వేతంక్ దీక్షిత్ మాట్లాడుతూ..నిర్వహణ ఖర్చు లు తగ్గడంతో లాభాల్లో వృద్ధి నమోదైందన్నారు.
స్పిన్సైలో వెయ్యి ఉద్యోగాలు
హైదరాబాద్, జనవరి 11:డిజిటల్ హెల్త్‌కేర్ సేవల సంస్థ స్పిన్సై టెక్నాలజీ..రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తరించనున్నట్లు, క్లినికల్ కోలాబరేషన్, పేషంట్ ఆర్థిక సేవల కోసం కొత్తగా ఏఐ ఆధారిత ఉద్యోగులను తీసుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రజిత్ కుమార్ తెలిపారు. ఇక్కడ అసాధారణమైన ఏఐ నిపుణులు ఉన్నారని, మిషిన్ లెర్నింగ్, డాటా అనలటిక్స్, డిజిటల్ హెల్త్ సేవలను అందించాలని ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు చెప్పారు.