Retail Inflation | జూలైలో చిల్లర ద్రవ్యోల్బణం కాసింత దిగి వచ్చింది. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతంగా నిలిచింది. గత మార్చి నుంచి ఇదే కనిష్టం. కానీ, వరుసగా ఏడో నెలలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పరిమితి కంటే ఎక్కువగా నమోదైంది. జూన్ చిల్లర ద్రవ్యోల్బణం ఏడు శాతానికి పైగా నమోదు కావడం వరుసగా మూడో నెల.
ఏడాది క్రితం 2021 జూలైలో చిల్లర ద్రవ్యోల్బణం 7.01 శాతంగా రికార్డయింది. ఆహార వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి కారణం. చిల్లర ద్రవ్యోల్బణంలో దాదాపు సగం వాటా ఆహార వస్తువులదే. 2022 జూన్లో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 7.75 శాతం కాగా, గత నెలలో 6.75 శాతానికి దిగి వచ్చింది.
అంచనాలకు అనుగుణంగానే చిల్లర ద్రవ్యోల్బణం జూలైలో తగ్గుముఖం పట్టిందని కొటక్ మహీంద్రా చీఫ్ ఎకనమిస్ట్ ఉపాసన భరద్వాజ్ చెప్పారు. ఆహార వస్తువుల ధరలు తగ్గడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 2023 జనవరి కల్లా ఆర్బీఐ పరిమితికి అనుగుణంగా ఆరు శాతానికి ద్రవ్యోల్బణం దిగి వస్తుందని అన్నారు. అటుపై ఆర్బీఐ తటస్థ వైఖరి ప్రదర్శిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.