‘ఈ 2022-23 ఆర్థిక సంవత్సరం ఉద్యోగ నియామకాల పరంగా మంచి ఆరంభాన్ని చూసింది. 5జీ సేవలకు సిద్ధమవుతున్న దేశీయ టెలికం రంగంలో హైరింగ్ డిమాండ్ బాగున్నది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని వ్యాపారాలు పుంజుకుంటుండటం కూడా జాబ్ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తున్నది. అన్ని కంపెనీలు ప్రతిభ, నైపుణ్యం కలిగినవారిని తీసుకుంటున్నాయి. అలాగే కొత్తవారికీ పెద్దపీట వేస్తున్నాయి. ఎగుమతి-దిగుమతి, టెలికం, ట్రావెల్, ఆతిథ్యం, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో ఉత్సాహం నెలకొన్నది’
-శేఖర్ గరిసా, మాన్స్టర్.కామ్ సీఈవో
ముంబై, జూన్ 7: జాబ్ మార్కెట్లో గత నెలలోనూ జోష్ కనిపించింది. నిరుడుతో చూస్తే మే నెలలో హైరింగ్ డిమాండ్ 9 శాతం వృద్ధి చెందింది. టెలికం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఎగుమతి-దిగుమతి రంగాల్లో ఉత్సాహం నెలకొన్నది. మంగళవారం విడుదలైన మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ (ఎంఈఐ) వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) మొదలు దేశీయ జాబ్ మార్కెట్ వృద్ధిపథంలోనే సాగుతున్నది. ఏప్రిల్‌లో 15 శాతం వృద్ధి నమోదైన విషయం తెలిసిందే. రిటైల్ రంగంలో రికవరీ ఇందుకు దోహదం చేసింది. అయితే అధిక ద్రవ్యోల్బణం తదితర ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ మే నెలలో ఉద్యోగ నియామకాలు కాస్త తగ్గుముఖం పట్టినట్టు ఎంఈఐ తెలియజేసింది.
ఫ్రెషర్లకు డిమాండ్
ఫ్రెషర్లకు డిమాండ్ ఏర్పడింది. ఆయా సంస్థలు నిర్వహణాపరమైన ఖర్చుల్లో నియంత్రణ దిశగా అడుగులు వేస్తుండటంతో కొత్తవారికి ఉద్యోగావకాశాల్ని ఎక్కువగా ఇస్తున్నాయి. ఇక మొత్తం 27 ఇండస్ట్రీల్లో 22 ఇండస్ట్రీలు ఉద్యోగాల పరంగా వృద్ధిని చూపించాయి. ఆఫీస్ ఎక్విప్మెంట్/ఆటోమేషన్ రంగం తర్వాత ఎగుమతి-దిగుమతి రంగంలోనే నియామకాలు అధికంగా జరిగినట్టు తాజా గణాంకాల్లో తేలింది.
మెట్రో నగరాల్లో..
నగరాలవారీగా కోయంబత్తూర్ మరోసారి ఉద్యోగావకాశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ముంబై ఉండగా, నాల్గో స్థానంలో హైదరాబాద్ ఉన్నది. జాబ్ మార్కెట్ పరంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో బరోడా, చండీగఢ్, జైపూర్, కోల్‌కతా వరుసగా ఉన్నాయి. వీటిలో వార్షిక వృద్ధి 2 నుంచి 12 శాతం మధ్య నమోదైంది. కాగా, ఆన్లైన్ రిక్రూట్మెంట్లు తగ్గుముఖం పట్టాయి. ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఇనుము, ఉక్కు ఆధారిత రంగాల్లో 9 శాతం పడిపోయినట్టు తేలింది.