ముంబై, సెప్టెంబర్ 10: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బడ్జెట్ 4జీ ఫీచర్ ఫోన్‌ను పరిచయం చేసింది. జియోఫోన్ ప్రైమా 2 పేరిట విడుదలైన ఈ మొబైల్ ధర రూ.2,799. 2.4 అంగుళాల డిస్ప్లే ఉన్న ఇందులో బ్యాక్, ఫ్రంట్ (సెల్ఫీ) కెమెరాలున్నాయి. ఏ థర్డ్-పార్టీ యాప్ లేకుండానే నేరుగా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. క్వాల్కామ్ చిప్‌తో 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సౌకర్యాలున్నాయి. కైఓఎస్‌తో నడిచే ఈ ఫోన్లో యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్, ఫేస్బుక్ యాప్‌లతోపాటు యూపీఐ పేమెంట్స్ కోసం జియోపే కూడా ఉంటుంది. అయితే వాట్సాప్ ఉండదు. ఇక సులభంగా దీని 2,000 మెగాహెట్జ్ బ్యాటరీని మార్చుకోవచ్చు. అంతేగాక ఇది 23 రకాల భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అలాగే జియో నెట్‌వర్క్‌లోనే పనిచేస్తుంది. కాగా, దీనికి ప్రత్యేక రిచార్జ్ ప్లాన్లున్నాయి. రూ.91లకే రోజుకు 100ఎంబీ డాటాతో 28 రోజుల కాలపరిమితిపై అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతోనే ఉన్న రూ.152 ప్లాన్‌లో రోజుకు 500ఎంబీ డాటా ఉంటుంది. రూ.895తో వార్షిక ప్లాన్ (336 రోజులు) కూడా ఉన్నది. ఇందులో 28 రోజులపాటు రోజుకు 2జీబీ డాటా వస్తుంది.