న్యూఢిల్లీ, మార్చి 17: ఐపీఎల్ లవర్స్‌కు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ఇచ్చింది. త్వరలో ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలవుతున్న క్రమంలో ప్రస్తుత, కొత్త జియో సిమ్ కస్టమర్లు రూ.299, ఆపై ప్లాన్లను రిచార్జ్ చేసుకుంటే 90 రోజులపాటు ఉచితంగానే జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లభించనున్నది మరి. అయితే ప్రస్తుత జియో నెట్వర్క్ వినియోగదారులు సోమవారం నుంచి ఈ నెలాఖరు (మార్చి 17 నుంచి మార్చి 31) మధ్య మొబైల్ ఫోన్ రిచార్జ్ చేసుకుంటేనే ఈ సదుపాయం ఉంటుంది. అలాగే ఈ తేదీల్లో కొత్తగా జియో నెట్‌వర్క్‌లోకి వచ్చే కస్టమర్లు ఈ ఆఫర్ కోసం రూ.299 (1.5జీబీ/డే లేదా ఆపైన), అంతకన్నా ఎక్కువ మొత్తంలో ప్లాన్లనే రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, మార్చి 17కు ముందు మొబైల్ రిచార్జ్ చేసుకున్నవారు రూ.100తో యాడ్-ఆన్ ప్యాక్ వేసుకుంటే మార్చి 22 నుంచి జియోహాట్‌స్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ అవుతుంది. ఈ నెల 22 నుంచే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న సంగతి విదితమే. ఇదిలావుంటే ఇంటి కోసం 50 రోజుల జియోఫైబర్/ఎయిర్‌ఫైబర్ ట్రయల్ కనెక్షన్ ఆఫర్ కూడా ఉన్నట్టు జియో చెప్తున్నది.