Jio 5G Phone | గూగుల్ సహకారంతో వినియోగదారులకు జియో 5జీ ఫోన్ అందుబాటులోకి తేనున్నదని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. సోమవారం జరిగిన రిలయన్స్ 45వ వార్షిక వాటాదారుల సమావేశం (ఏజీఎం)లో ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే, జియో 5జీ ఫోన్ ఎప్పుడు ఆవిష్కరిస్తారు, దాని ధర ఎంత, అందులో ఫీచర్ల వివరాలేవీ వెల్లడించలేదు. కొన్ని వార్తా కథనాల ప్రకారం రిలయన్స్ జియో 5జీ ఫోన్ చౌకగానే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తున్నది. ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి రావచ్చునని అంచనా.
జియో 5జీ ఫోన్ ధర రూ.10-12 వేల మధ్య ఉండొచ్చునని అంచనా. కొన్ని వార్తా కథనాల ప్రకారం రూ.2,500 ల్లోపు ఉండొచ్చునని సమాచారం. 5జీ సెగ్మెంట్లో 5జీ స్మార్ట్ ఫోన్ చౌక ధరకే లభిస్తుందని అంచనా వేయడం కాసింత కష్టంగానే ఉన్నది. ఒకవేళ ఎక్కువ ధర ఉంటే డౌన్‌పేమెంట్, ఈఎంఐ ఆప్షన్లు కల్పించవచ్చునని సమాచారం. ఈ ఫోన్ ద్వారా భారీగా డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తదితర బెనిఫిట్లు అందుకోవచ్చునని తెలియ వచ్చింది. గతేడాది గూగుల్ సహకారంతోనే జియో ఫోన్ నెక్ట్స్ 4జీ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
జియో 5జీ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉండొచ్చునని అంచనా. పిక్సెల్ రిజొల్యూషన్ 1600 x 720 మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు. స్నాప్ డ్రాగన్ 480 5జీ ఎస్వోసీతో సిద్ధం అవుతున్న 5జీ ఫోన్లో 4జీబీ రామ్, 32 జీబీ స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఇస్తారు. ఫస్ట్ సెన్సర్‌లో 13 మెగా పిక్సెల్స్తోపాటు 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కూడా వస్తాయి. సెల్ఫీ ఫొటోల కోసం 8-మెగా పిక్సెల్ సెన్సార్ జత చేశారు. జియో ఆండ్రాయిడ్ ఫోన్లో జత చేసిన ఓఎస్‌నే జియో ఫోన్ 5జీలోనూ వినియోగించవచ్చునని భావిస్తున్నారు.