రిలయన్స్ అనుబంధ జియో ఫైనాన్సియల్స్ సంస్థ కూడా ఫిన్ టెక్ లావాదేవీల్లో భాగమైంది. జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ అనుబంధ జియో పేమెంట్ సొల్యూషన్స్‌కు ఆన్ లైన్ పేమెంట్ లావాదేవీలు జరిపేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. తమ సంస్థ ఆన్ లైన్ లావాదేవీలు జరిపేందుకు ఆర్బీఐ అనుమతించడంతో భారత్ డిజిటల్ పేమెంట్ సర్వీసుల దిశగా ఒక కీలక అడుగు ముందుకు పడిందని జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ మంగళవారం స్టాక్ ఎక్స్చేంజీల ఫైలింగ్‌లో తెలిపింది.
ఆర్బీఐ అనుమతులకు అనుగుణంగా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ -2007లోని సెక్షన్ -7కు లోబడి డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు జియో పేమెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలియాస్ జియో పేమెంట్ సొల్యూషన్స్ (జేఎస్పీఎల్) కు అనుమతి ఇస్తున్నట్లు జేఎస్‌పీఎల్‌కు ఆర్బీఐ సోమవారం సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్ అందజేసింది. ఈ వార్త వెలుగు చూడటంతో మంగళవారం జియో ఫైనాన్సియల్ షేర్లు వృద్ధి చెందాయి. 1.45 శాతం లాభంతో రూ.321.45 వద్ద ట్రేడ్ అయ్యాయి.
జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) అనుబంధ జియో పేమెంట్స్ బ్యాంకు ప్రస్తుతం డిజిటల్ సేవింగ్స్ అక్కౌంట్స్ విత్ బయో మెట్రిక్ అథంటికేషన్, ఫిజికల్ డెబిట్ కార్డు జారీ చేస్తోంది. 15 లక్షల మంది ప్రస్తుతం సేవలు అందుకుంటున్నారు. ఇటీవల కొత్త ఖాతాదారులను చేర్చుకోరాదంటూ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో జియో పేమెంట్ బ్యాంకుకు అడ్వాంటేజీ కానున్నదని భావిస్తున్నారు.