ముంబై, అక్టోబర్ 9: ఈ ఏడాది జ్యుయెల్లరీ సంస్థల షేర్ల (Juewellery Shares) విలువ భారీగా పడిపోయింది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగున్నా.. ఆయా కంపెనీల స్టాక్స్ మదుపరులను ఆకట్టుకోకపోవడం గమనార్హం. కల్యాణ్ జ్యుయెల్లర్స్, సెన్కో గోల్డ్, స్కై గోల్డ్ తదితర సంస్థల పరిస్థితి ఇదే. వీటన్నిటి పన్ను అనంతర లాభాలు 48 శాతం నుంచి 105 శాతంగా నమోదైనా.. ఈక్విటీ మార్కెట్లలో ఏమాత్రం కలిసిరాలేదు మరి. మరోవైపు బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదంతా రోజుకో రికార్డు అన్నట్టుగానే సాగింది. ఈ క్రమంలోనే 10 గ్రాముల పసిడి ధర 56 శాతం, కిలో వెండి రేటు 69 శాతం పుంజుకున్నాయి. అయినప్పటికీ ఆభరణాల విక్రయదారులకు ఆదరణ కరువే అయ్యింది.
రూ.1,000 కోట్లకుపైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఉన్న 14 జ్యుయెల్లరీ స్టాక్స్ తీరుతెన్నులను విశ్లేషిస్తే.. ఈ ఏడాది మొదలు ఈ నెల 6దాకా 11 స్టాక్స్ నష్టాలకే పరిమితమయ్యాయి. అత్యధికంగా కల్యాణ్ జ్యుయెల్లర్స్ షేర్ విలువ ఈ ఏడాది 35.87 శాతం పడిపోయింది. ఆ తర్వాత సెన్కో గోల్డ్ (34.87 శాతం), మోతీసన్స్ జ్యుయెల్లర్స్ (32.10 శాతం) షేర్లున్నాయి. రెనైసెన్స్ గ్లోబల్, స్కై గోల్డ్ అండ్ డైమండ్స్, త్రిభువన్దాస్ భీమ్జీ జవేరీ, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్, పీసీ జ్యుయెల్లర్, ఏషియన్ స్టార్ కంపెనీ, రాధికా జ్యుయెల్టెక్, డీ.పీ. అబుషన్ షేర్ల విలువ కూడా 29.91 శాతం నుంచి 4.28 శాతం వరకు దిగజారింది.
అయితే గోల్డియం ఇంటర్నేషనల్ (0.5 శాతం), టైటాన్ కంపెనీ (6.11 శాతం), తంగమైల్ జ్యుయెల్లరీ (10.62 శాతం) షేర్ల విలువ మాత్రం పెరిగింది. ఇక ఈ ఏడాది ఆగస్టు 19న లిస్టింగైన బ్లూస్టోన్ జ్యుయెల్లరీ అండ్ లైఫ్‌ైస్టెల్ షేర్ విలువ 20 శాతం ఎగిసింది. అయితే శాంతీ గోల్డ్ ఇంటర్నేషనల్ షేర్ విలువ పడిపోయింది. రూ.227.55కు లిస్టింగైతే.. దాదాపు రూ.205 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హై రికార్డుల్లో కదలాడుతుండటమే.. జ్యుయెల్లరీ స్టాక్స్ నష్టాలకు కారణమని మార్కెట్ నిపుణులు అనుజ్ గుప్తా అంటున్నారు. సాధారణంగా మార్కెట్లో డిమాండ్ ఉంటేనే.. ధర పెరుగుతుంది. కాబట్టి గోల్డ్, సిల్వర్‌కు డిమాండ్ ఉందని, అయితే అది స్టాక్ మార్కెట్లలో ఆభరణాల కంపెనీల షేర్లను కొనేలా కాకుండా.. భౌతిక బంగారం కొనేలా, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టేలా ఉన్నదని మెజారిటీ ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారిప్పుడు. ఇక అధిక ధరలు 18 క్యారెట్ తదితర తక్కువ రకం నగల కొనుగోళ్లకు దోహదం చేస్తున్నాయని కూడా చెప్తున్నారు.
గురువారం వెండి ధర ఆల్‌టైమ్ హైకి వెళ్లింది. ఢిల్లీలో కిలో రూ.6,000 ఎగసి రూ.1,63,000 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ మునుపెన్నడూ లేనివిధంగా ఔన్స్ రేటు 50 డాలర్లను తాకింది. ఇక బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,26,600గానే ఉన్నది.