2000 Effect on Gold | రూ.2000 కరెన్సీ నోటును మార్కెట్లో చలామణి నుంచి విత్ డ్రా చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించగానే ప్రజల్లో ఆందోళన మొదలైంది. భారీ మొత్తంలో రూ.2000 నోట్లు కల వారు బంగారం కొనుగోళ్ల కోసం దేశంలోని జ్యువెల్లరీ దుకాణాలను సంప్రదించారు. గత రెండు రోజులుగా రూ.2000 నోట్లతో బంగారం కొనుగోళ్లు తక్కువేనని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. తప్పనిసరిగా ‘కేవైసీ’ నిబంధనలు అమలు చేయాల్సి రావడం దీనికి కారణంగా తెలుస్తున్నది. రూ.2000 కరెన్సీ నోట్లతో బంగారం కొనుగోలు చేసే వారిపై జ్యువెల్లరీ వ్యాపారులు 5-10 శాతం అధికంగా ధర వసూలు చేస్తున్నారని సమాచారం. అంటే 10 గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.66 వేల మార్క్‌కు చేరుతున్నది. వాస్తవంగా దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.60 నుంచి రూ.61 వేల మధ్య తచ్చాడుతున్నది.
రూ.2000 కరెన్సీ నోటుతో బంగారం, వెండి కొనుగోళ్లకు చాలా మంది ఆరా తీశారని, అయినా ‘కేవైసీ’ నిబంధనలు అమలు చేయాల్సి రావడంతో సేల్స్ తక్కువగానే నమోదయ్యాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ సాయిరామ్ మెహ్రా తెలిపారు. రూ.2000 నోట్ల మార్పిడికి ఆర్బీఐ నాలుగు నెలల గడువు పెట్టినందు వల్ల ఆందోళనకరమైన పరిస్థితులేం లేవన్నారు. సంఘటిత రంగంలో అంటే జ్యువెల్లరీ ఆభరణాల దుకాణాలు బీఐఎస్ హాల్ మార్క్ బంగారం విక్రయాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అసంఘటిత రంగ బులియన్ వ్యాపారుల వద్ద మాత్రమే రూ.2000 నోట్లకు బంగారం విక్రయాలు సాగుతాయని పీఎన్జీ జ్యువెల్లరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్జిల్ తెలిపారు.
ప్రస్తుతం రూ.2000 నోట్ల మార్పిడికి బంగారం విక్రయాలు చేస్తే కొంత ప్రీమియం ధర పెరుగుతుండవచ్చు. కానీ, బంగారం ఆభరణాలు విక్రయించే దుకాణాలు కేవైసీ, ఆదాయం పన్ను, హవాలా లావాదేవీల నిరోధక చట్టాలను అమలు చేయాల్సి ఉంటుందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. నోట్ల రద్దు సమయంలో ప్రజలు భారీగా బంగారం కొనుగోళ్లు చేసినా.. ప్రస్తుతం నిబంధనలు అడ్డంకిగా నిలిచాయని తెలుస్తున్నది. రూ.2 లక్షల్లోపు బంగారం ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆ పరిధి దాటితే మాత్రం పాన్, ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు నోయిడా పరిధిలో పేరొందిన ఆభరణాల విక్రయ దుకాణంలో రూ.5 లక్షలకు పైగా రూ.2000 నోట్లకు బంగారం గాజులు కొనుగోలు చేశారని సమాచారం. శనివారం పలు బంగారం దుకాణాలకు భారీగా జనం తరలి వచ్చినట్లు చెబుతున్నారు. అసిస్టెంట్లు మిషన్లతో మనీ లెక్కించడంలో బిజీబిజీగా ఉన్నారని ఒక దుకాణ సేల్స్ మన్ చెప్పారు.
రూ.2000 నోట్లపై భారీగా బంగారం కొనుగోళ్లు జరిగినా.. ఆదాయం పన్నుశాఖ అధికారులు ఫోకస్ చేయకుండా ఉండాలంటే అధిక ధర చెల్లించాల్సిందేనని బంగారం దుకాణాల యజమానులు చెబుతున్నారని కస్టమర్లు చెబుతున్నారు. అధిక విలువ గల బంగారం కొనుగోళ్లు జరిపితే పాన్ కార్డు వివరాలు వెల్లడించడం తప్పనిసరి.
అధిక ధర వల్ల అక్షయ తృతీయ టైంలో తగ్గిన సేల్స్.. రూ.2000 నోటు మార్పిడితో పెంచుకోవచ్చునని కామ్ ట్రెండ్జ్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞానశేఖరన్ త్యాగరాజన్ చెప్పారు. అయితే, నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డు వివరాలు సమర్పిస్తే ఆదాయం పన్నుశాఖ అధికారులకు ఆదాయం వివరాలు వెల్లడించాల్సి వస్తుంది. కనుక బంగారంతోపాటు కన్జూమర్ డ్యూరబుల్స్, ఫర్నీచర్, విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు చెప్పారు. బంగారం కొనుగోళ్లు పెరిగితే, రియాల్టీ రంగంలో లావాదేవీలు తగ్గుతాయంటున్నారు.