ATF | ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర దాదాపు ఒక శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా నెలవారీ సమీక్షలో భాగంగా చమురు కంపెనీలు ఏపీఎఫ్ ధరలను సవరించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర 0.8 శాతం పెరిగి కిలోలీటర్‌కు రూ.94,543.02కి చేరుకుంది. జెట్ ఇంధన ధరలు పెరుగడం ఇది వరుసగా రెండోసారి. గత నెల అక్టోబర్ 1న ఏటీఎఫ్ ధరలు దాదాపుగా రూ.3,052 పెరిగాయి. అంతకు ముందు సెప్టెంబర్‌లో కిలోలీటర్‌కు రూ.1,308.41 తగ్గింది. ఏటీఎఫ్ ధరల పెరుగుదలతో విమానయాన సంస్థలపై భారం పడనున్నది. వీటి నిర్వహణ ఖర్చుల్లో ఇంధనానికే దాదాపు 40శాతం ఉంటుంది. ఇక ముంబయిలో ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు రూ.87,714.39 నుంచి 88,44.87కి చేరింది. వ్యాట్‌ను బట్టి నగరాల వారీగా ధరల్లో మార్పులు ఉంటాయి.
ఇదిలా ఉండగా.. చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించాయి. 19 కిలోల ఎల్పీసీ సిలిండర్ ధర రూ.5 తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ తెలిపాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,590.50 ఉంది. గతంలో ఇది రూ.1,595.50గా ఉండేది. ఇక కోల్‌కతాలో రూ.1,694, ముంబైలో రూ.1,542, చెన్నైలో రూ.1,750, హైదరాబాద్‌లో రూ.1,812.50గా ఉంది. అయితే, గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 మధ్య కొనసాగుతున్నాయి.