Jet Airways | మూడేండ్ల క్రితం నేలకు పరిమితమైన ప్రైవేట్ ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్ వచ్చే నెలలో తిరిగి సర్వీసులు ప్రారంభించనున్నది. వాణిజ్య విమాన యాన సేవలందించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి ఆదివారం జెట్ ఎయిర్వేస్కు సెక్యూరిటీ క్లియరెన్స్ లభించింది. ఈ నెల ఐదో తేదీన హైదరాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ ప్రయోగాత్మకంగా విమాన సర్వీసును పరీక్షించింది. దివాళా తీసిన తర్వాత 2019 ఏప్రిల్ 17 నుంచి విమాన సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షించడం ఇదే తొలిసారి.
జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ నాటికి విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తామని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ (ఏవోపీ) వచ్చిన కొన్ని నెలల తర్వాత విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ఏవోపీ ఆమోదం పొందడానికి జెట్ ఎయిర్వేస్ ఐదు విమాన సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షించాల్సి ఉంటుంది.
నరేశ్ గోయల్ సారధ్యంలో జెట్ ఎయిర్వేస్ పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకుంది. సకాలంలో రుణాలు చెల్లించలేకపోయినందుకు దివాళా తీసిన జెట్ ఎయిర్వేస్ 2019లో నేలకు పరిమితమైంది. తర్వాత నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) వేలంలో జెట్ ఎయిర్వేస్ను దుబాయి కేంద్రంగా పని చేస్తున్న మురళీలాల్ జలాన్, లండన్ కేంద్రంగా పని చేస్తున్న కల్రాక్ కన్సార్టీయం గెలుచుకుంది.