Quick Commerce | రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ జియోమార్ట్.. త్వరలో క్విక్ కామర్స్ సేవల్లోకి రానున్నట్లు సమాచారం. తొలుత దేశంలోని ఎనిమిది నగరాల్లో క్విక్ కామర్స్ సేవలు లభిస్తాయి. ఆన్లైన్లో కస్టమర్లు పెట్టిన ఆర్డర్లను వీలైనంత త్వరగా డెలివరీ చేసే సేవలనే ‘క్విక్ కామర్స్’ అని అంటారు. అర్ధగంట లోపు పండ్లు, కూరగాయలతోపాటు నిత్యావసర వస్తువులను త్వరలో పంపిణీ చేయాలని జియోమార్ట్ తలపోస్తున్నదని ఆ సంస్థ సన్నిహిత వర్గాల కథనం.
దేశమంతటా రిలయన్స్ రిటైల్‌కు దాదాపు 19 వేల కేంద్రాలు ఉన్నాయి. ఇక దశల వారీగా దేశంలోని వెయ్యి నగరాలకు జియోమార్ట్ క్విక్ కామర్స్ సేవలను విస్తరించ తలపెట్టిందని సమాచారం. ఇది జరిగితే దేశంలోని క్విక్ కామర్స్ సంస్థల్లోనే జియోమార్ట్ మొదటి స్థానంలో నిలువనున్నది. విక్రయ కేంద్రాల నుంచే ఆప్ లైన్, ఆన్ లైన్ ఆర్డర్లు తీసుకుని ప్రతి ప్రాంతానికి క్విక్ కామర్స్ సేవలు విస్తరించి, వ్యాపారవృద్ధికి జియోమార్ట్ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆ సంస్థ వర్గాల కథనం.