Amazon | ప్రముఖ ఈ-కామర్స్ జెయింట్, ప్రపంచ బిలియనీర్లలో ఒకరు జెఫ్ బెజోస్.. ఇటీవల సంస్థలో ఒకే ఒక షేర్ కొన్నారు. ప్రపంచ బిలియనీర్లలో మూడో ర్యాంకులో కొనసాగుతున్న జెఫ్ బెజోస్ ఒకే షేర్ కొనడమేంటి అనే సందేహం వస్తుందా.. కానీ ఇది నిజం. స్వయంగా స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన సమాచారంలో జెఫ్ బెజోస్ వెల్లడించారు. 2002 తర్వాత సంస్థలో షేర్ కొనుగోలు చేయడం కూడా ఇప్పుడే.
21 ఏండ్లుగా అమెజాన్ సంస్థ షేర్లు విక్రయించడమే తప్ప, కొన్న దాఖలాలు లేవు. 2002 నుంచి ఇప్పటి వరకు సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అలా వచ్చిన డబ్బు ఇతర వ్యాపారాలకు మళ్లించారు. రెండు వారాల క్రితం 114.77 డాలర్లతో ఒక షేర్ కొనుగోలు చేశారు జెఫ్ బెజోస్. గత శుక్రవారం మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే సరికి సంస్థ షేర్ విలువ 124 డాలర్ల వద్ద ముగిసింది. అంటే జెఫ్ బెజోస్ 10 డాలర్ల లాభం సంపాదించారన్న మాట.
1997లో అమెజాన్.. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయింది. నాటి నుంచి ఇప్పటి వరకు సంస్థ స్టాక్స్‌లో పరిహారం అందుకోలేదు. ఇప్పుడు సంస్థలో అమెజాన్‌లో 10 శాతం వాటా ఉంది. ప్రస్తుతం జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపద 148 బిలియన్ డాలర్లలో అమెజాన్ షేర్ల వాటా ఎక్కువ. ఆయన ఒక్క షేర్ మాత్రమే కొనడానికి కారణాలు తెలియ రాలేదు. కానీ ఆ షేర్ కొనుగోలు చేయడంతోపాటు 80 లక్షల డాలర్ల విలువ గల 69,290 షేర్లను ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందజేశారు.