Flipkart – Jawa Yezdi | ఇప్పటి వరకూ స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్‌లు.. ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే ఆన్లైన్లో.. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్‌లో ఆర్డర్ పెట్టేవారం.. మనకు డెలివరీ వచ్చేది. ఇప్పుడు మోటారు సైకిళ్లు కూడా ఆన్ లైన్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ బాట పడుతున్నాయి. ఆ బాటలో అడుగేసింది ప్రీమియం మోటారు సైకిళ్ల తయారీ సంస్థ జావా యెజ్డీ మోటార్ సైకిల్స్. ఇక నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ లో జావా యెజ్డీ మోటారు సైకిళ్లు ప్రీ-ఆర్డర్ బుక్ చేసుకోవచ్చునని జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.. ఈ విషయమై రెండు సంస్థల మధ్య సహకార ఒప్పందం కుదిరింది.
ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న 50 కోట్ల మంది యూజర్లతో విస్తృత శ్రేణిలో కస్టమర్లకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నది జావా యెజ్డీ మోటార్ సైకిల్స్. ఇందులో నో-కాస్ట్ ఈఎంఐ, బై నౌ పే లేటర్, డౌన్ పేమెంట్ లేకుండా జావా యెజ్డీ మోటార్ సైకిల్ బుకింగ్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సెలెక్టెడ్ మోడల్ మోటారు సైకిళ్లు బుక్ చేసుకుంటే రూ.22,500 వరకూ బెనిఫిట్లు అందించింది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.