Maruti Suzuki | భారత్‌లో న్యూ గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ఏర్పాటు చేస్తామని జపాన్ సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి ప్రకటించారు. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర సంస్థలతో పోటీ పడేందుకు ఈ రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో తమ పెట్టుబడులు మరింత పెరుగుతాయని తోషిహిరో సుజుకి చెప్పారు. భారత్‌లో మారుతి సుజుకి ఏర్పాటై 40 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజుకి మాట్లాడుతూ సుజుకి గ్రూప్ సంస్థలకు భారత్ అత్యంత ముఖ్యమైన మార్కెట్ అని స్పష్టం చేశారు.
మారుతి సుజుకిలో మెజారిటీ వాటా గల సుజుకి సంస్థ భారత్‌లో చిన్న, లో-కాస్ట్ కార్ల మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నది. కానీ కొనుగోలు దారుల నుంచి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) వంటి పెద్ద కార్లకు గిరాకీ పెరిగింది. సురక్షితమైన, పర్యావరణ హిత కార్లను తయారు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు నిబంధనలు రూపొందిస్తున్నాయి. దీంతో ఖర్చులు పెరగడంతోపాటు ఇతర ఆటోమొబైల్ సంస్థల నుంచి మారుతి సుజుకికి గట్టి పోటీ ఎదురవుతున్నది.
రూ.65 వేల కోట్ల (8.13 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మారుతి సుజుకి ద్వారా సుజుకి సంస్థకు ఆదాయం, లాభాల్లో భారత్ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. భారత్ కార్ల మార్కెట్‌పై పట్టును కొనసాగించేందుకు మద్దతు కొనసాగుతుందని తోషిహిరో సుజుకి చెప్పారు. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా 28 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తే, 60 శాతానికి పైగా భారత్‌లోనే తయారయ్యాయన్నారు.