ITI Laptop | బెంగళూరు, సెప్టెంబర్ 11: ప్రభుత్వరంగ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఐటీఐ లిమిటెడ్ తాజాగా ల్యాప్‌టాప్‌ను రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించిన సొంత బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌తోపాటు మైక్రో పీసీని సైతం ఆవిష్కరించి మార్కెట్లోకి సైతం విడుదల చేసింది. ఇంటెల్ కార్పొరేషన్‌తో కలిసి రూపొందించిన ఈ ‘స్మాష్’ పేరుతో వీటిని ప్రవేశపెట్టింది కూడా. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలైన ఏసర్, హెచ్‌పీ, డెల్, లెనోవా కంపెనీలతో పోటీపడి టెండర్లను దక్కించుకున్నట్లు ఐటీఐ తెలిపింది.
ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీనిచ్చేలా ప్రపంచస్థాయి క్వాలిటీతో వీటిని తయారు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు ఆర్డర్లు పొందింది సంస్థ. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ నుంచి రెండు టెండర్లు దక్కించుకున్నామని, సుమారు 9 వేల ల్యాప్‌టాప్‌లను కేరళలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసినట్లు ఐటీఐ చైర్మన్ రాజేశ్ రాయ్ తెలిపారు.