IT Jobs | న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఐటీ రంగంలో నియామకాలు అంతంతమాత్రంగానే ఉంటాయంటున్నారు. ప్రధాన ఐటీ సంస్థలు గతంతో పోల్చితే ఈసారి ఉద్యోగాలు చాలా తక్కువగా ఇవ్వవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాదాపు 60 శాతం నియామకాలు పడిపోనున్నాయన్న సంకేతాలు వస్తుండటం గమనార్హం. ఐటీ పరిశ్రమను ఆవరించిన మందగమనం, అనిశ్చిత వాతావరణం వల్లే ఈ పరిస్థితి అన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
లక్షలోపే కొత్త ఉద్యోగాలు
ఈ ఆర్థిక సంవత్సరం 50 వేలు, లక్ష మధ్యనే ఐటీ కంపెనీల నుంచి కొత్త ఉద్యోగాలు రావచ్చని స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో చెప్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) 2,50,000లకుపైగా నియామకాలు జరిగినట్టు గుర్తుచేస్తున్నది. దీంతో 60 నుంచి 80 శాతం మేర ఉద్యోగాలు తగ్గిపోవచ్చని పేర్కొంటున్నది. ఈ తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశీయ ఐటీ ఇండస్ట్రీలో టాప్-5 సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా నియామకాలు 21,838 పడిపోయినట్టు తేలింది. నిరుడుతో చూస్తే టీసీఎస్ ఉద్యోగ నియామకాలు దాదాపు 500 పెరగగా, మిగతా నాలుగు సంస్థలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలోనే తగ్గించుకున్నాయి.
విదేశీ సంస్థల్లోనూ..
దేశీయ కంపెనీలతోపాటు విదేశీ ఐటీ రంగ సంస్థలూ నియామకాల విషయంలో ఆచితూచే స్పందిస్తున్నాయి. భారత్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని కలిగి ఉన్న గ్లోబల్ టెక్నాలజీ సంస్థలైన యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్.. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దాదాపు 6 వేల చొప్పున ఉద్యోగాలకు కోత పెట్టాయి. ఇక ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా కొత్త నియామకాలు గతంతో పోల్చితే సుమారు 50 శాతం పడిపోవడం గమనార్హం.
గ్లోబల్ మార్కెట్ డీలా
దేశీయ ఐటీ కంపెనీలకు ప్రధానంగా ఆదాయం వచ్చేది విదేశీ ప్రాజెక్టుల ద్వారానే అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల మార్కెట్లో భారతీయ ఐటీ కంపెనీలకు విశేష ఆదరణ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయా దేశాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు.. దేశీయ ఐటీ కంపెనీలను నిరుత్సాహపరుస్తున్నాయి. ఆశించిన స్థాయిలో ప్రాజెక్టుల్లేక అన్ని కంపెనీలు ఒకింత అయోమయంలోనే పడ్డాయి. ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను వెంటాడుతున్నాయి. దీంతో ఈ సమస్యలు ఎప్పుడు కొలిక్కి వస్తాయా? అన్న ఆశతో అటు ఉద్యోగార్థులు, ఇటు ఐటీ కంపెనీలు ఎదురుచూస్తున్నాయిప్పుడు.
‘గడిచిన ఐదేండ్లలో నేను అత్యంత కఠిన పరిస్థితుల్ని చూసిన త్రైమాసికం బహుశా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలమే. అయితే ఈ పరిస్థితులు తాత్కాలికమే. మంచి రోజులు ముందున్నాయి. దేశీయ ఐటీ ఇండస్ట్రీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అస్థిర పరిస్థితులే ఈ అనిశ్చితికి కారణం. అక్కడ అంతా సర్దుకుంటే. ఇక్కడా బాగానే ఉంటుంది’
-సీపీ గుర్నాని, టెక్‌మహీంద్రా సీఈవో
‘అంతర్జాతీయ విపణిలో చోటుచేసుకున్న ఆర్థిక అననుకూలత పరిస్థితులు.. దేశీయ ఐటీ సంస్థల్లో కొత్త ఉద్యోగావకాశాల్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల నుంచి తగ్గిన వ్యాపారం వల్ల 25-30 శాతం నియామకాలు పడిపోయే వీలున్నది. డిసెంబర్‌దాకా పరిస్థితులు ఇంతే అనుకోవచ్చు. అయితే వచ్చే ఏడాది జనవరి-మార్చిలో ఫ్రెషర్స్‌కు డిమాండ్ ఉండొచ్చు’
-విజయ్ శివరామ్, క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో
‘ఐటీ సేవల కంపెనీలు చేపట్టే నియామకాలు ఈసారి భారీగా పడిపోవచ్చు. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు చాలాచాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో సంస్థలన్నీ అనవసరపు ఖర్చులను తగ్గించుకునే వ్యయ నియంత్రణ చర్యల వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నికర ఉద్యోగ నియామకాల్లో 40 శాతం తగ్గుదల ఉండొచ్చనిపిస్తున్నది’
-సునీల్, టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో