న్యూఢిల్లీ, డిసెంబర్ 15: సెన్సెక్స్ 71,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించడంలో టాటాలు, అంబానీలు, ఆదానీలకంటే ప్రభుత్వ రంగ కంపెనీలు, ప్రభుత్వ బ్యాంక్ లు ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా 60,000 పాయింట్ల నుంచి 70,000 పాయింట్లకు జరిగిన 10కే రన్లో ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ రెట్టింపుకావడం విశేషం. 2021 సెప్టెంబర్‌లో సెన్సెక్స్ తొలిసారిగా 60 వేల స్థాయిని తాకింది. ఇది 70 వేలకు చేరడానికి రెండేండ్ల రెండు నెలలు (551 ట్రేడింగ్ సెషన్లు) పట్టింది. ఈ మధ్యకాలంలో పీఎస్‌యూల మార్కెట్ విలువ రెట్టింపై డిసెంబర్ 14 నాటికి రూ.46.4 లక్షల కోట్లకు చేరింది. వీటి విలువ 129 శాతం పెరిగింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ కంపెనీల విలువ 46.9 శాతం పెరిగి రూ.14.37 లక్షల కోట్లను అందుకోగా, ముకేశ్ అంబానీ రిలయన్స్ గ్రూప్ సంపద 10.3 శాతం చొప్పున వృద్ధిచెంది రూ.18.61 లక్షల కోట్లకు చేరింది. టాటా గ్రూప్ సంస్థలు విలువ 33.7 శాతం ఎగిసి రూ.27.40 లక్షల కోట్లకు చేరింది. వీటిలో అన్నింటికంటే అధికంగా ఎస్బీఐ మార్కెట్ విలువ రూ.5.78 లక్షల కోట్లకు చేరుకోగా, తర్వాతి స్థానాల్లో ఎల్ఐసీ (రూ.5.5 లక్షల కోట్లు), ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇం డియా, పవర్గ్రిడ్లు ఉన్నాయి.