ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధర లక్ష రూపాయలకు దగ్గర్లో కదలాడుతున్నది.
ఆ మధ్య తులం విలువ మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటినా తిరిగి కిందకు దిగొచ్చింది.
అయితే ఈ ఏడాది ఆఖరుకల్లా 24 క్యారెట్ 10 గ్రాముల రేటు రూ.1,50,000కు చేరుకోవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,500 డాలర్లు పలికితే ఇది సాధ్యమేనంటున్నారు మరి.
న్యూఢిల్లీ, జూన్ 2: త్వరలో బంగారం ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పబోతున్నాయా? ఇప్పట్లో ఎవరూ ఊహించని స్థాయిని తాకబోతున్నాయా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయిప్పుడు. ఇప్పటికే దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల రేటు లక్ష రూపాయల మార్కును దాటేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో తులం మునుపెన్నడూ లేనివిధంగా రూ.1, 01,600 పలికింది. అయితే దేశ, విదేశీ పరిస్థితుల నడుమ ధరలు కొంతమేర తగ్గినా.. ఇంకా లక్ష రూపాయల సమీపంలోనే కదలాడుతున్నాయి. కానీ ఈ ఏడాది ఆఖరుకల్లా ధరలు భారీ ఎత్తున ఎగబాకవచ్చన్న అభిప్రాయాలు మార్కెట్ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
లక్షన్నరకు..
అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఔన్స్ గోల్డ్ రేటు గరిష్ఠంగా 4,500 డాలర్లకు చేరవచ్చని ప్రముఖ బహుళ
జాతి బ్యాంకింగ్ సంస్థ, ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్స్ సాచ్స్ చెప్తున్నది. మరో సంస్థ యూబీఎస్ కూడా ఇదే అభిప్రాయాన్ని కనబరుస్తుండటం గమనార్హం. దీంతో ఈ అంచనాలే నిజమైతే భారతీయ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమనడం ఖాయమే. ఈ క్రమంలోనే 24 క్యారె ట్ తులం విలువ రూ.1,50,000గా ఉంటుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈక్విటీల్లో..
దేశ, విదేశీ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు పెరిగితే.. మదుపరులు తమ పెట్టుబడులను సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపునకే మళ్లిస్తారు. కాబట్టి ఈక్విటీ సూచీల తీరుతెన్నులు కూడా గోల్డ్ రేట్లను నిర్దేశించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావం సైతం ఇన్వెస్టర్ల మైండ్‌సెట్‌ను మార్చగలవన్నని చెప్పకతప్పదు. ఇప్పటికే భారత్‌సహా ఆసియాలోని కీలక దేశాల స్టాక్ మార్కెట్లలో నిలకడ లోపించింది. అమెరికా, ఐరోపా మార్కెట్లదీ ఇదే పరిస్థితి. దీంతో బంగారంపై పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింతగా పెరిగితే ధరలు పరుగులు పెడుతాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక దేశీయ మార్కెట్ విషయానికొస్తే.. పండుగలు, పెండ్లిళ్ల సీజన్ ప్రభావం అదనంగా పుత్తడి ధరలపై కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ ఏడాది ఆఖర్లో తులం పసిడి లక్షన్నర రూపాయల మార్కును అందుకుంటుందన్న అంచనాలైతే ఉన్నాయి.
రూ.98,930 వద్దకు..
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో సోమవారం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.98,930 పలికింది. హైదరాబాద్‌లో కూడా ఇదే స్థాయిలో ధరల పెరుగుదల ఉన్నప్పటికీ.. తులం రూ.97, 640గానే ఉన్నది. ఇక 22 క్యారెట్ 10 గ్రాములు క్రిందటి రోజు ముగింపుతో పోల్చితే రూ.300 పుంజుకొని రూ.89,500గా ఉన్న ది. కాగా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 పెరిగి లక్ష రూపాయల మార్కుకు ఎగువన రూ.1,00,100గా నమోదైంది. అమెరికాలోకి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని ట్రంప్ యోచిస్తుండటంతో మళ్లీ రేట్లు పెరుగుతూపోతున్నాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ విశ్లేషిస్తున్నది. ఇదిలావుంటే అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ స్పాట్ మార్కెట్లో 59.21 డాలర్లు ఎగిసి 3,348.61 డాలర్లకు చేరింది.