Hyundai |న్యూఢిల్లీ, జూలై 10: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటర్.. తాజాగా దేశీయ మార్కెట్లోకి ఎంట్రిలెవల్ ఎస్యూవీ మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్టర్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ రూ.5.99 లక్షల నుంచి రూ.9.31 లక్షల లోపు లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. వీటిలో 19.2 కిలోమీటర్ల మైలేజీ వచ్చే ఐదు-స్పీడ్ ఆటోమేటిక్ రకం ధరను రూ.7.96 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..27.1 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే సీఎన్జీ రకం రూ.8.23 లక్షలుగా నిర్ణయించింది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్‌ను టాటా మోటర్స్‌కు చెందిన పంచ్‌కు పోటీగా సంస్థ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ మాట్లాడుతూ..ఈ నూతన మాడల్ ఎక్స్టర్తో పూర్తి స్థాయి ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించినట్టు అయిందని, ఈ మాడల్‌ను తీర్చిదిద్దడానికి రూ.950 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు. ఇప్పటి వరకు భారత్‌లో రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు చెప్పిన ఆయన.. చెన్నై ప్లాంట్ సామర్థ్యాన్ని 8.2 లక్షల నుంచి 8.5 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.