న్యూఢిల్లీ, నవంబర్ 19: దేశీయంగా ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌కు తిరుగేలేదని మరోసారి రుజువైంది. అత్యంత ఖరీదైన హై-స్ట్రీట్ రిటైల్ లొకేషన్లలో ఈ ఏడాదీ ఇదే టాప్ మరి. అంతర్జాతీయంగా మాత్రం 24వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చితే ఒక ర్యాంక్ దిగజారింది. నిరుడు విడుదలైన జాబితాలో 23వ స్థానంలో ఉన్నది. కాగా, గ్లోబల్ రియల్ ఎస్టేట్ దిగ్గజం కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ‘2025లో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వీధులు’ పేరిట తమ ప్రతిష్ఠాత్మక రిటైల్ రిపోర్టును బుధవారం ప్రకటించింది. 138 అత్యుత్తమ అర్బన్ రిటైల్ లొకేషన్లను ఇందులో పేర్కొన్నది. ఈ వివరాల ప్రకారం ఢిల్లీ ఖాన్ మార్కెట్లో వార్షిక అద్దె చదరపు అడుగుకు దాదాపు రూ.19,500గా ఉన్నది.
లండన్దే పైచేయి..
లండన్‌లోని న్యూ బాండ్ స్ట్రీట్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ మార్కెట్ ప్రాంతంగా అవతరించింది. ఇక్కడ వార్షిక అద్దె చదరపు అడుగుకు 2,231 డాలర్లు పలుకుతున్నది. ఇక ఇటలీలోని మిలాన్లోగల వయా మాంటే నెపోలియన్ ఈసారి అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పరిమితమైంది. ఇక్కడ ఏడాదికి చదరపు అడుగు అద్దె 2,179 డాలర్లు. మూడో స్థానంలో న్యూయార్క్ అప్పర్ 5వ అవెన్యూ ఉన్నది. ఇక్కడి 49 నుంచి 60దాకా ఉన్న వీధుల్లో చదరపు అడుగు అద్దె 2,000 డాలర్లు. పోయినసారి ఇది 2వ స్థానంలో నిలిచింది. హాంకాంగ్‌లోని సిమ్ షా సుయ్ 4వ స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో పారిస్ (అవెన్యూ డెస్ చాంప్స్-ఎలీసిస్), టోక్యో (గింజా), జ్యురిచ్ (భనోస్ట్రసీ), సిడ్నీ (పిట్ స్ట్రీట్ మాల్), సియోల్ (మియాంగ్డాంగ్), వియన్నా (కోల్మార్ట్) ఉన్నాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ముంబై విభాగం ప్రతినిధి గౌతమ్ సరఫ్ తెలిపారు. భారత్‌లో ఖాన్ మార్కెట్‌తోపాటు కన్నౌట్ ప్లేస్, గలేరియా మార్కెట్లు.. దేశ, విదేశీ బ్రాండ్లను ఆకట్టుకుంటున్నాయని, దీంతో అక్కడ ఆయా రిటైల్ ఔట్లెట్లు వెలుస్తున్నాయని చెప్పారు.