ISRO Spadex Mission | స్పాడెక్స్ మిషన్‌లో భాగంగా నిర్వహించిన డాకింగ్ టెస్ట్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం డాకింగ్ ప్రక్రియ ఈ నెల 7న జరగాల్సి ఉండగా.. 9వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. డాకింగ్ ప్రక్రియను వాయిదాకు గల కారణాలను వెల్లడించలేదు. కేంద్ర ఎర్త్ సైన్స్ మంత్రి జితేంద్ర సింగ్ స్పాడెక్స్ మిషన్‌కు ఇండియన్ డాకింగ్ టెక్నాలజీగా నామకరణం చేశారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో ఈ మిషన్‌ను చేపట్టింది. తొలిసారిగా డాకింగ్ టెస్ట్‌ను నిర్వహించనున్నది. మిషన్‌లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ఉపగ్రహాలను భూమి తక్కువ కక్ష్యలో ఒకదానితో మరొకదాన్ని ఇస్రో అనుసంధించనున్నది. ఇప్పటి వరకు, రష్యా, అమెరికా, చైనాకు మాత్రమే క్లిష్టమైన ఈ సాంకేతిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నది.
ఇస్రో సైతం ఈ ఘనతను సాధించేందుకు రెడీ అవుతున్నది. ఇందులో ఇస్రో విజయవంతమైన డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనున్నది. ప్రక్రియలో భాగంగా దాదాపు గంటకు 28,800 కిలోమీట్ల వేగంతో ప్రయాణించే రెండు స్పేస్‌క్రాఫ్ట్‌లను అనుసంధానం చేస్తారు. టెస్ట్‌లో సెన్సార్ సెట్‌ని ఉపయోగించి ఉపగ్రహాల వేగాన్ని తగ్గించి.. ఆ తర్వాత ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారతీయ డాకింగ్ మెకానిజంపై ఇస్రో ఇప్పటికే పేటెంట్ తీసుకుంది. డాకింగ్ అనేది సంక్లిష్టమై పక్రియ. ఎందుకంటే రెండు స్పేస్‌క్రాఫ్ట్‌లను కక్ష్యలో ఉంచాలి. ముఖ్యంగా ఒకదానితో మరొకటి ఢీకొట్టకుండా చూడాల్సి ఉంటుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ త్వరలో చంద్రయాన్-4 మిషన్‌కు సిద్ధమవుతుంది. చంద్రుడిపై నమూనాలను సేకరించనున్నది. ఈ మిషన్‌ను రెండు విడుతలుగా చేపట్టనున్నది. ఈ క్రమంలో డాకింగ్‌లో నైపుణ్యం సాధించడం తప్పనిసరని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. ఇక స్పాడెక్స్ మిషన్‌లో భాగంగా డిసెంబర్ 30న శ్రీహరికోటలోని లాంచ్‌ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ సీ-60 వాహహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఎస్‌డీఎక్స్01(చేజర్), ఎస్‌డీఎక్స్02(టార్గెట్) అనే 440 కిలోలు ఉన్న రెండు చిన్న ఉపగ్రహాలను ఈ వాహకనౌక నిర్ణీత భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటిని భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ రెండింటినీ 3 మీటర్ల సమీపానికి చేర్చి డాకింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.