ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గగనతలంలో మరోసారి గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్ పేర్కొన్నారు. శ్రీహరికోటలోని భాస్కర్ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచం మొత్తాన్ని భారత్ వైపు చూసేలా ఇస్రో చేసిందన్నారు. డిసెంబర్ 30న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ విజయవంతంగా రెండు ఉపగ్రహాలను ప్రవేశపెట్టి.. స్పేస్‌లోనే విజయవంతంగా డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసింది. కాస్త ఆలస్యమైనా.. ఇస్రో శాస్త్రవేత్తలు దిగ్విజయంగా డాకింగ్ ప్రక్రియను నిర్వహించారన్నారు. ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిందని తెలిపారు.
శ్రీహరికోటలో మూడో లాంచ్‌ప్యాడ్ ఏర్పాటుకు రూ.3,984.86 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. దాంతో భవిష్యత్‌లో భారీ ఉపగ్రహాలను ఇస్రో రాకెట్ల ద్వారా ఉపయోగించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే షార్‌లో రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయని గుర్తు చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూడో ప్రయోగ వేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సూళ్లూరుపేట, శ్రీహరికోటతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జనవరి 29న ఇస్రో వందో ప్రయోగం చేపట్టబోతుందన్నారు. అంతకు ముందు ఆయన శ్రీహరికోట స్పేస్ సెంటర్ పాఠశాల ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.