హైదరాబాద్, మే 19: మానవ వనరుల నిర్వహణ సంస్థ ఐసాల్వ్‌డ్..భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 400కి పెంచుకోనున్నట్టు కంపెనీ ఇండియా జనరల్ మేనేజర్ యోగేష్ మోర్ తెలిపారు. క్లయింట్లకు ఇక్కడి నుంచి టెక్నాలజీ, ఏఐ సేవలు అందించనున్నట్టు, ఏఐ హబ్‌గా మారిన హైదరాబాద్‌లో తమ టెక్నాలజీ సేవలను విస్తరించడానికి వీలుపడనున్నదన్నారు.
ఒత్తిడిలో సూచీలు
ముంబై, మే 19: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడం, రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకోవడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి అరగంటలో అమ్మకాలు పోటెత్తాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో ఇంధన ధరలు భగ్గుమనడం మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 114.19 పాయింట్లు నష్టపోయి 75,200.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.95 పాయింట్లు కోల్పోయి 23,618 వద్ద పరిమితమైంది.