BSNL | న్యూఢిల్లీ, జూలై 12: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. మరో ప్లాన్ను పరిచయం చేసింది. ఒకవైపు టెలికం దిగ్గజాలు తమ ప్లాన్ల ధరలను పెంచుతూ పోతుంటే..మరోవైపు బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుడి లక్ష్యంగా చేసుకొని పలు ప్లాన్లను ఆవిష్కరిస్తున్నది. దీంట్లోభాగంగా 35 రోజుల కాలపరిమితితో రూ.107 కనీస రీచార్జి ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద 200 నిమిషాలు ఏ నెట్వర్క్కైనా మాట్లాడుకోవచ్చును, అలాగే 3జీబీ డాటాను వినియోగించుకోవచ్చును.
టెలికం దిగ్గజాలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్ల కంటే ఇదే చౌకది కావడం విశేషం. ఇటీవల కాలంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ప్లాన్ల ధరలను 25 శాతం వరకు పెంచాయి. దీంతో కస్టమర్లు ఈ నెట్వర్క్లను వదిలి తక్కువ ప్లాన్లను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లో 4జీ సేవలు అందిస్తున్న బీఎస్ఎన్ఎల్..వచ్చే నెల చివరినాటికి ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నది.