న్యూఢిల్లీ, నవంబర్ 15: కేంద్ర ప్రభుత్వం వాటాల్ని విక్రయిస్తున్న ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)తొలి పబ్లిక్ ఆఫర్‌కు ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించింది. ఈ నెల 21న మొదలై 23న ముగియనున్న ఈ ఆఫర్లో ఒక్కో ఈక్విటీ షేరును రూ.30-32 ధరల శ్రేణిలో విక్రయిస్తారు. గత ఏడాది మే నెలలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవో తర్వాత పబ్లిక్కు వాటాల్ని ఆఫర్ చేస్తున్న ప్రభుత్వ సంస్థ ఇదేకావడం గమనార్హం. ఈ ఆఫర్లో కేంద్ర ప్రభుత్వం 26.8 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. వీటితో పాటుగా రూ.10 ముఖ విలువ కలిగిన 40.3 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తుంది. అంటే మొత్తం 67.1 కోట్ల షేర్లు ఈ ఐపీవో ద్వారా పబ్లిక్కు జారీచేయనున్నారు. ఆఫర్ ప్రైస్‌బ్యాండ్‌ను త్వరలో ప్రకటిస్తారు. ఆఫర్లో 50 శాతం అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. 35 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. 18.75 లక్షల షేర్లను సంస్థ ఉద్యోగులకు కేటాయిస్తారు.