ASBA | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. పాలసీదారుల కోసం బీమా-ఏఎస్బీఏ (అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) పేరిట ఓ సరికొత్త ప్రీమియంల చెల్లింపు విధానాన్ని పరిచయం చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ప్రీమియం చెల్లింపు కోసం పాలసీదారులు తమ బ్యాంక్ ఖాతాల్లో సరిపడా నిధులను నిలుపుదల చేయడానికి ఇది దోహదపడుతుందని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తెలిపింది. జీవిత, ఆరోగ్య బీమా కోసం ప్రీమియం చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడమే దీని ఉద్దేశమని పేర్కొన్నది. కాగా, మార్చి 1 నుంచి బీమా-ఏఎస్బీఏ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. దీన్ని అమలు చేయాలని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ తాజాగా స్పష్టం చేసింది. నిజానికి ఏఎస్బీఏ లేదా యూపీఐ ద్వారా ఖాతాల్లో నగదు నిలుపుదల సదుపాయాన్ని స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎప్పట్నుంచో విరివిగా వాడుతున్నారు.
జీవిత బీమా లేదా ఆరోగ్య బీమా తీసుకోవాలనుకునేవారికి పాలసీ ఆమోద సమయంలో నగదు సమస్య రాకుండా, ప్రీమియం చెల్లింపులు ఆగిపోకుండా ఉండేందుకు ఈ బీమా-ఏఎస్బీఏ సౌకర్యం కలిసిరానున్నది. మనలో చాలామంది బీమా పాలసీలను కొనాలని నిర్ణయించుకొని, ఆ ప్రక్రియ మొదలుపెట్టాక.. మధ్యలో నగదు లేక వెనకడుగు వేస్తూంటారు. ఇలాంటివారు బీమా-ఏఎస్బీఏను ఎంచుకొంటే తప్పక బీమా రక్షణను పొందగలరని ఐఆర్డీఏఐ ఆశిస్తున్నది. దేశ ప్రజలందరికీ బీమా రక్షణ లభించాలన్న లక్ష్యంలో భాగంగానే దీన్ని తెచ్చారు. ఇక పాలసీదారుల బ్యాంక్ ఖాతాలో ఒకసారి బీమా ప్రీమియంకు సంబంధించిన నగదు ఆగితే.. పాలసీ జారీ అయ్యాకే సదరు బీమా సంస్థకు ఆ సొమ్ము బదిలీ అవుతుంది. కాబట్టి పాలసీదారుల నగదుకు పూర్తి భద్రత ఉన్నట్టే. యూపీఐ ద్వారా వన్-టైమ్ మ్యాండేట్ (ఓటీఎం) సహాయంతో తమ బ్యాంక్ ఖాతాల్లో కస్టమర్లు నిర్దిష్ట నగదును నిలుపుదల చేయవచ్చు. ఒకవేళ బీమా పాలసీ ప్రతిపాదన తిరస్కరణకు గురైతే ఈ నగదు తిరిగి ఖాతాదారునికి అందుబాటులోకి రాగలదు. అయితే అప్పటిదాకా ఆ సొమ్మును ఖాతాదారులు కూడా వాడుకోలేరు.