Apple iOS 26 | ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు భారీ అప్డేట్ను అందించింది. కొత్తగా తీసుకువచ్చిన ఐవోఎస్ 26 పేరుతో తాజాగా సాఫ్ట్వేర్ అప్డేట్ను తీసుకువచ్చింది. ఇది 2025లో విడుదలైన అగ్రశ్రేణి టెక్నికల్ అప్డేట్గా నిలవనుంది. ఐఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా మార్చేయనున్నది. ఇది ఐఫోన్స్ రూపురేఖలను పూర్తిగా మార్చేయనున్నది. ముఖ్యంగా ‘లిక్విడ్ గ్లాస్ డిజైన్’ అనే సరికొత్త విజువల్ థీమ్‌తో పాటు మొత్తం 26 అధునాతన ఫీచర్లతో వినియోగదారులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. ఈ అప్డేట్ ఐఫోన్‌ను మరింత స్మార్ట్‌గా, ఆకర్షణీయంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లో ప్రధాన ఆకర్షణగా ‘లిక్విడ్ గ్లాస్ డిజైన్’ నిలుస్తున్నది. గ్లాస్ తరహాలో పారదర్శకంగా ఉండే ఈ కొత్త డిజైన్, స్క్రీన్‌పై ఉన్న కంట్రోల్స్, బటన్లకు ఓ కొత్తదనం తీసుకువచ్చింది.
ఫోన్ కదలికలకు అనుగుణంగా కదలడం, వాడకాన్ని మరింత నెమ్మదిగా, శాంతంగా, ఆకర్షణీయంగా మార్చనున్నాయి. లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, కంట్రోల్ సెంటర్స్‌లో డైనమిక్ హైలైట్స్, కలర్ మార్పులు విశేష ఆకర్షణగా నిలువనున్నాయి. అంతేకాకుండా, లాక్ స్క్రీన్‌లోని ఫోటోకు అనుగుణంగా టైమ్ 3D ఎఫెక్ట్‌తో ప్రదర్శించబడే విధానం వినియోగదారులను అలరిస్తోంది. యాప్ ఐకాన్లను లైట్, డార్క్, కలర్ టింటెడ్, గ్లాస్ స్టైల్ల్లో మోడిఫై చేసుకునే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యాపిల్ ఇంటెలిజెన్స్ (Apple Intelligence) అనే ఏఐ ఆధారిత ఫీచర్లకు పెద్దపీట వేయడం గమనార్హం. ముఖ్యంగా ‘లైవ్ ట్రాన్స్లేషన్’ ఫీచర్ ద్వారా మెసేజెస్ యాప్‌లో చైనీస్, ఫ్రెంచ్, జర్మన్ సహా ఎనిమిది భాషల్లో వచ్చిన సందేశాలను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ చేసే సౌలభ్యం లభిస్తోంది. ఫేస్‌టైమ్ వీడియో కాల్స్‌లో రియల్‌టైమ్‌లో సబ్‌టైటిల్స్‌ను వేరే భాషలో చూపించే విధానం చాట్ అనుభూతిని మరింత ప్రభావవంతంగా మార్చేయనున్నది. అలాగే, సాధారణ ఫోన్ కాల్స్‌లో అవతలి వ్యక్తి మాట్లాడే భాషను యూజర్ కోరుకున్న భాషలోకి అనువదించి వినిపించే ఫీచర్ కూడా ఉంది. ఎయిర్ పాడ్స్ వాడుతున్న సమయంలో ప్రత్యక్ష సంభాషణలను కూడా ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.
వినియోగదారుల సమయాన్ని ఆదా చేసేందుకు యాపిల్ కొత్త స్మార్ట్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ‘కాల్ స్క్రీనింగ్’ ఫీచర్ ద్వారా తెలియని నంబర్ల నుంచి ఫోన్‌కు వచ్చిన కాల్ ముందు.. రింగ్ ముందే సిస్టమ్ వారి వివరాలను అడిగి, వినియోగదారుడికి సమాచారంగా తెలియజేస్తుంది. అనవసర కాల్స్‌కి స్పందించాల్సిన అవసరం లేకుండా ఇది సహాయపడుతుంది. ‘హోల్డ్ అసిస్టెంట్’ అనే మరో కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్ కేర్ కాల్స్‌లో హోల్డ్‌లో వేచి ఉండాల్సిన బాధ్యతను ఐఫోన్ తీసుకుంటుంది. ఏజెంట్ అందుబాటులోకి వచ్చేదాకా లైన్లో ఉండి, వెంటనే నోటిఫికేషన్ రూపంలో వినియోగదారునికి సమాచారం అందిస్తుంది. iOS 26లో వినియోగదారుల క్రియేటివిటీకి సహాయపడే అనేక ఫీచర్లు చేరాయి. ‘జెన్మోజీ క్రియేషన్’ ద్వారా ఎమోజీలను వివరణలతో కలిపి కొత్త ఎక్స్‌ప్రెషన్స్‌ను రూపొందించుకునే అవకాశాన్ని ఆపిల్ కల్పించింది. ‘ఇమేజ్ ప్లేగ్రౌండ్’ ఫీచర్ ద్వారా వినియోగదారులు చాట్‌జీపీటీ తరహాలో చిత్రాలను సైతం రూపొందించుకునే వీలుంటుంది. ఇక మెసేజెస్ యాప్‌లో ప్రతి చాట్‌కు వేర్వేరు బ్యాక్గ్రౌండ్లను సెట్ చేసుకునే సౌలభ్యం అందుబాటులో ఉంటుంది. గ్రూప్ చాట్స్‌లో పోల్స్ నిర్వహించే సదుపాయం, మ్యాప్స్‌లో ప్రతిరోజూ వినియోగించే మార్గాలను ముందుగానే గుర్తించే ఫీచర్, యాపిల్ మ్యూజిక్‌లో పాటలను డీజే స్టైల్లో ఆటోమిక్స్ చేయడం వంటి మరిన్ని ఫీచర్లు ఈ అప్డేట్లో ఉన్నాయి. అలాగే, మూడు కీలక అంశాల్లో విప్లవాత్మక మార్పులు సైతం ఉన్నాయి.