Mutual funds | ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ల్లోకి వెళ్లండని మదుపరులకు ఫండ్ మేనేజర్లు, సలహాదారులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్మాల్ క్యాప్ ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులను పరిశీలించాలని కోరుతుంటారు. ఈ పథకాల్లో మదుపరులు తమ మిగులు నగదును పెట్టుబడిగా పెడితే దీర్ఘకాలం సంపాదించవచ్చని చెప్తూంటారు. అయితే ఈ స్మాల్ క్యాప్ ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులు పెడితే వచ్చే లాభమెంత?.. మదుపరులకున్న రిస్క్ ఎంత? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
స్మాల్ క్యాప్ ఎంఫ్ పథకాల నుంచి ఏ స్థాయి రాబడులను ఆశించవచ్చు అని మదుపరుల్లో సందేహం కలుగవచ్చు. ఇందుకోసం ఆయా పథకాల గత పనితీరునూ పరిశీలిస్తూంటారు. అయితే గతంలో తక్కువ రాబడులను అందించిన పథకాలు.. భవిష్యత్తులోనూ అలాగే ఉంటాయని అనుకోవద్దు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు అనేవి మార్కెట్ రిస్క్‌లకు లోబడి ప్రతిఫలాలను అందిస్తాయన్న విషయం మరువద్దు. కాబట్టి కేవలం గత ట్రేడింగ్ తీరు ఆధారంగా ఓ అంచనాకు రావద్దు. ఆయా స్కీమ్‌ల మునుపటి పర్ఫార్మెన్స్ను పరిశీలించడం తెలివైన పనే అయినప్పటికీ.. మార్కెట్లో ప్రస్తుత ట్రెండ్‌నూ తప్పక పరిగణనలోకి తీసుకోవాలని మెజారిటీ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతమున్న పథకాల్లో టాప్-5ని పరిశీలిస్తే వాటి బెంచ్‌మార్క్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఆకర్షణీయంగానే ఉన్నది. ఇదే సమయంలో సదరు పథకాల రాబడులూ బాగానే ఉన్నాయి. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే రాబడి పదేండ్లకు సగటున 26 శాతంగా ఉన్నది.
స్మాల్ క్యాప్ పథకాల్లో పెట్టుబడులు పెట్టేముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. స్మాల్ క్యాప్ పథకాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. ఎందుకంటే ఇవి చాలా చిన్న సంస్థల్లో పెట్టుబడులు పెడుతాయి. ఈ కంపెనీల్లో పాలనాపరమైన సమస్యలు ఉండవచ్చు. ఆయా రంగాల్లో సవాళ్లు, మార్కెట్లో గడ్డు పరిస్థితులనూ ఇవి చవిచూడాల్సి వస్తుంది. కనుక ఈ ప్రభావం వీటిల్లో పెట్టుబడులు పెట్టే స్మాల్ క్యాప్ ఎంఫ్లపైనా సహజంగానే కనిపిస్తుంది. దీంతో మదుపరులూ ప్రభావితం కావాల్సి ఉంటుంది. ఈ ఆటుపోట్లన్నింటికీ దూరంగా ఉండాలనుకునే మదుపరులు వీటి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. పైగా ఈ స్మాల్ క్యాప్ పథకాల్లో మదుపు సమయం కూడా ఏడు నుంచి పదేండ్లుంటుంది.