సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. ఇల్లు లేనివారు ఓ ఇల్లు కొనాలనుకుంటే.. ఇప్పటికే ఇల్లున్నవారు మరింత పెద్ద ఇల్లు కావాలనుకుంటారు. అయితే మనలో చాలామంది పెద్ద ఇల్లు కొనాలనుకున్నప్పుడు సొంతంగా కొంత, మిగతాది గృహ రుణంతో సమకూర్చుకోవాలని చూస్తారు. కానీ లోన్ ఆధారంగా ఇల్లు తీసుకోవడం భారమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
గృహ రుణం ఇలా..
మీరు కోటి రూపాయలతో ఓ కొత్త ఇల్లు కొనాలనుకున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఉన్న ఇంటిని అమ్మితే రూ.65 లక్షలు వచ్చాయి. మిగతా రూ.35 లక్షలు గృహ రుణం తీసుకున్నారు. దీంతో ఏడేండ్ల కాలపరిమితికి 7 శాతం వడ్డీతో లోన్ తీసుకున్నైట్లెతే నెలసరి ఈఎంఐ రూ.52,824గా ఉంటుంది. ఇలా మొత్తం ఏడేండ్లకు రూ.44,37,216 బ్యాంక్‌కు చెల్లించాలి. ఇందులో మీరు చెల్లించే వడ్డీ రూ.9,37,216. ప్రాసెసింగ్ ఫీజుల భారం ఎలాగూ ఉంటుంది.
పెట్టుబడి సాయంతో..
పాక్షిక యాజమాన్యం మార్గం ద్వారా ఓ కమర్షియల్ ప్రాపర్టీలో మీ సేవింగ్స్ నుంచి రూ.25 లక్షలను పెట్టుబడిగా పెట్టారనుకుందాం. ప్రతీ మూడేండ్లకు 15 శాతం అద్దె పెరిగినా, 7 ఏండ్లకు ఏటా కనీసం రూ.2 లక్షల చొప్పున ఆదాయం అందుకోవచ్చు. ఇదే సమయంలో పెట్టుబడి విలువ కనిష్ఠంగా రూ.10.17 లక్షలైనా పెరుగుతుంది. దీంతో మీ పెట్టుబడుల విలువ ఏడేండ్లలో రూ.35.17 లక్షలకు చేరగా, దీనికి అద్దె ఆదాయం రూ.14 లక్షలు కలిపితే రూ.49.17 లక్షలు అవుతుంది. అంటే ఇంటి విలువ రూ.65 లక్షలకు కలిపితే మన దగ్గర ఉండేది రూ.1.14 కోట్లపైనే. మీ పెద్దింటి కలను కొన్నేండ్లు వాయిదా వేసుకుంటే వచ్చే లాభం ఇది.