Electric Vehicles | న్యూఢిల్లీ, జనవరి 29: భారత్‌సహా వివిధ దేశాల్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)దే భవిష్యత్తు అని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెప్తున్నది. దేశీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చేపట్టిన సర్వేలో ప్రతీ 10 మందిలో ఆరు లేదా ఏడుగురు (సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది) తాము కొనాలనుకునే లేదా కొనబోయే తదుపరి వాహనం ఎలక్ట్రిక్ వెహికిలేనని చెప్పడం గమనార్హం. అయితే 60 శాతం మంది ఈవీలకు చార్జింగ్ సదుపాయాల కొరత వేధిస్తున్నదని అభిప్రాయపడ్డారు.
అమెరికా, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్, చైనా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో ‘టీసీఎస్ ఫ్యూచర్-రెడీ ఈమొబిలిటీ స్టడీ 2025’ పేరిట ఈ సర్వే జరిగింది. వాహనదారులతోపాటు రవాణా, చార్జింగ్ ఇన్ఫ్రా తదితర రంగాలవారు కూడా పాల్గొన్నట్టు టీసీఎస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా సుమారు రూ.35 లక్షల (40వేల డాలర్లు)తో ఓ ఈవీని కొనేందుకు సిద్ధంగా ఉన్నామని 56 శాతం మంది తెలిపారు.
మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, వేగంగా చార్జింగ్, ఆకర్షణీయ డిజైన్, ఎక్కువ మైలేజీ వంటివి ఈవీల కొనుగోళ్లను ఇంకా పెంచగలవని ఈ అధ్యయనంలో పాల్గొన్న 90 శాతం తయారీదారులు అభిప్రాయపడ్డారు. అలాగే వీరిలో 74 శాతం మంది ఈవీ మార్కెట్ వృద్ధికి ప్రధాన అవరోధంగా చార్జింగ్ సదుపాయాల కొరతేనని పేర్కొన్నారు.
చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే సేల్స్ దూసుకుపోతాయన్న నమ్మకాన్ని కనబర్చారు. 60 శాతం మంది వాహన వినియోగదారులూ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చార్జింగ్ పాయింట్లు పెంచాల్సి ఉందన్నారు. ఇక అమెరికాలో 72 శాతం మంది ఈవీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. సింగిల్ చార్జింగ్‌పై 200-300 కిలోమీటర్ల శ్రేణిలో మైలేజీ ఇచ్చే ఈవీలను కొంటామని 41 శాతం మంది చెప్తున్నారు.