హైదరాబాద్, డిసెంబర్ 18: క్వాలిటీ ఇంజినీరింగ్, డిజిటల్ సేవలు అందిస్తున్న అంతర్జాతీయ సంస్థ క్వాలిజీల్..హైదరాబాద్లో మరో కెపబిలిటీ సెంటర్ను ప్రారంభించింది. ఇప్పటికే నగరంలో సంస్థకు రెండు సెంటర్లు ఉండగా, తాజాగా మూడో సెంటర్ను బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో కళ్యాణ్ కొండా మాట్లాడుతూ.. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ఈ సెంటర్ను నెలకొల్పినట్లు, ముఖ్యంగా ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగాలపై మరింత దృష్టి సారించడానికి వీలు పడనున్నదన్నారు. రాబోయే నాలుగేండ్లలో 3,500కి పైగా ఉద్యోగాలు, 130 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కెపబిలిటీ సెంటర్ ఆవిష్కరణల కేంద్రంగా మారుతున్నదని, ఈ విస్తరణ సాంకేతికతను , ప్రతిభను ప్రోత్సహించడానికి దోహదం చేయనున్నదన్నారు.