ముంబై, జూన్ 18: ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు లేవని, సమయం వచ్చినప్పుడు రేట్లపై నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టంచేశారు. ఈటీ నౌస్ లీడర్షిప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..పరపతి సమీక్షను అత్యవసరంగా మార్చాల్సిన అవసరం లేదని, ద్రవ్యోల్బణం దిగొచ్చాక, మిగతా పరిణామాలను కూడా బేరీజు వేసుకున్న తర్వాతనే రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఫ్యూచర్, ఆప్షన్ ట్రేడింగ్ మార్కెట్లలో అధిక ట్రేడింగ్ గణాంకాలపై సెబీతో కలిసి ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే మార్చి త్రైమాసికపు కరెంట్ ఖాతా లోటును వచ్చేవారంలో విడుదల చేస్తామన్నారు.