హోమ్లోన్స్ మీద వడ్డీరేట్లు భారీగానే తగ్గాయి. ప్రస్తుతానికి బ్యాంకులు, హోమ్‌లోన్ కంపెనీలు 7 శాతం కన్నా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. మీరు ఇప్పటికే హోమ్‌లోన్ తీసుకుని అంతకన్నా ఎక్కువ వడ్డీరేటును చెల్లిస్తున్నట్టయితే, వెంటనే హోమ్‌లోన్ రీఫైనాన్సింగ్ కోసం ప్రయత్నించండి. దాంతో లక్షల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు త్వరగా హోమ్‌లోన్‌ను తిరిగి చెల్లించే వీలు కూడా కలుగుతుంది.
ఎందుకు?
కొన్నేండ్ల కింద తీసుకున్న హోమ్‌లోన్స్‌కు ప్రస్తుత వడ్డీ కన్నా చాలా ఎక్కువ వడ్డీని చెల్లిస్తుంటారు. సాధారణంగా హోమ్‌లోన్స్‌పై వడ్డీరేట్లు.. ఆర్బీఐ నిర్ణయించే బెంచ్‌మార్క్ వడ్డీరేట్లకు అనుగుణంగా ఉంటాయి. అలాగే రుణం తీసుకునేవారి ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ను బట్టి కూడా వడ్డీరేట్లను నిర్ణయిస్తారు. స్థిరంగా కచ్చితమైన ఆదాయ వనరులుండి క్రెడిట్ స్కోర్ 750కిపైగా ఉంటే వడ్డీరేట్లు తక్కువగానే ఉంటాయి. మీరు పదేండ్ల క్రితం తీసుకున్న రుణాలకు అప్పటి బెంచ్‌మార్క్ వడ్డీరేట్లకు అనుగుణంగానే వడ్డీని నిర్ణయించి ఉంటారు. ప్రస్తుతం రుణాలపై వడ్డీరేట్లు రెపోరేటుకు అనుగుణంగా నిర్ణయిస్తున్నారు. చాలా పారదర్శకత వచ్చింది. అలాగే రెపోరేట్లలో తగ్గుదల కారణంగా హోమ్‌లోన్‌పై వడ్డీరేట్లు కూడా తగ్గుతూ ఉన్నాయి.
ఎలా?
రీఫైనాన్సింగ్‌కు వెళ్లాలనుకున్న తర్వాత మన ముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. ప్రస్తుత హౌజింగ్ ఫైనాన్స్ సంస్థతోనే రీఫైనాన్స్ కు వెళ్లడం, దాని కోసం ఆ సంస్థను సంప్రదించడం. రెండోది.. తక్కువ వడ్డీని ఆఫర్ చేసే మరో బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించడం. అయితే చాలా పేపర్‌వర్క్ ఉంటుంది. మళ్లీ ఆదాయ, క్రెడిట్ ప్రొఫైల్, ప్రాసెసింగ్ ఫీ, ఎంఓడి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయినా సరే మరో సంస్థతో రీఫైనాన్సింగ్ మేలుగా ఉందనుకుంటే ఏడాదిలోగానే ఈ ఖర్చులన్నీ రికవరీ అవుతాయి.
ఎప్పుడు?
అనేక సందర్భాల్లో రీఫైనాన్సింగ్ మనకు ప్రయోజనకారిగా ఉండొచ్చు. అందులో మొదటిది.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వడ్డీరేట్ల కన్నా మీరు తీసుకున్న వడ్డీరేటు చాలా ఎక్కువగా ఉండటం. కనీసం అర శాతం నుంచి అంత కన్నా ఎక్కువ మీరు వడ్డీ చెల్లిస్తున్నట్టయితే రీఫైనాన్సింగ్ కోసం ప్రయత్నించవచ్చు. రెండోది.. మీరు తీసుకున్న హోమ్‌లోన్ కాలపరిమితి ఇంకా చాలా కాలం ఉంటే రీఫైనాన్సింగ్ ద్వారా ఎక్కువగా ఆదా చేయవచ్చు. నిజానికి ఎంత కాలం ఎక్కువ ఉంటే.. అంత ఆదా అవుతుంది. అయితే రుణగ్రహీతల స్థితిగతులను బట్టి ప్రయోజనాలుంటాయి. మూడోది.. మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ పెరిగిన సందర్భాల్లోనూ తక్కువ వడ్డీపై రుణం పొందవచ్చు.
రీఫైనాన్సింగ్ అంటే?
చాలా సింపుల్. ఇప్పుడున్న అధిక వడ్డీ హోమ్‌లోన్‌ను తీర్చేసి, కొత్త లోన్‌ను తక్కువ వడ్డీకి తీసుకోవడం. దీని కోసం రుణాన్ని ఇచ్చే కొత్త సంస్థకు మన డాక్యుమెంట్స్ అన్నీ బదీలీ అవుతాయి. కొత్తగా రుణం ఇచ్చిన సంస్థనే పాత రుణాన్ని మొత్తం చెల్లిస్తుంది. ఇక నుంచి మీ ఈఎంఐలు కొత్త సంస్థకే చెల్లించాల్సి వస్తుంది.
జాగ్రత్తలు
రీఫైనాన్సింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత కనీసం నాలుగైదు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కొటేషన్ తీసుకోండి. రీఫైనాన్సింగ్‌కు వెళితే ప్రస్తుతం చెల్లిస్తున్న రుణం కన్నా వచ్చే ప్రయోజనాన్ని బేరిజు వేయండి. మీ అవసరాలు అంటే.. రీపేమెంట్ వెసులుబాట్లు, కస్టమర్ సర్వీసు, కనీస ప్రీ-పేమెంట్ లాంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోండి. కొన్ని సందర్భాలలో చౌక ఒక్కటే ముఖ్యం కాదు. సర్వీసూ ముఖ్యమే. మొత్తానికి రీఫైనాన్సింగ్‌కు మాత్రం ప్రస్తుతం కలిసొచ్చే కాలమే.